Loading...
Cyclone Arnab: తెలంగాణలోనూ అర్నాబ్ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
తెలంగాణలోనూ అర్నాబ్ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Cyclone Arnab: తెలంగాణలోనూ అర్నాబ్ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తుఫాను ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తోంది. ఈ తుఫాను కారణంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాలతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగే అవకాశముండటంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర విద్యా సిబ్బంది భద్రతకు ఇబ్బందులు తలెత్తవచ్చని అధికారులు భావించారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు అక్టోబర్ 28న ఒక రోజు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌-యానాం ప్రాంతాల మధ్య అర్నాబ్ తుఫాను తీరం దాటే అవకాశం

మరోవైపు, అర్నాబ్ తుఫాను బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌-యానాం ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాను దిశలో మార్పులు చోటుచేసుకుంటే నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశముందని హెచ్చరించింది.

దీని ప్రభావంతో తెలంగాణలోని సూర్యపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

వివరాలు 

తుఫాను ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాలకూ..

గురువారం నాటికి తుఫాను ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాలకూ విస్తరించే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ADVERTISEMENT