Arvind Kejriwal: తొలిరోజే నీరసించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు షుగర్‌లెవల్స్ తగ్గిపోవడంతో బాగా నీరసించిపోయారు. 14 /8 విస్తీర్ణం కలిగిన జైలులో ఆయన ఉంచినట్లు జైలు అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం 4గంటలకు కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తీసుకురాగా సెల్‌లోకి పంపించేముందు ఆయనకు పూర్తిగా వైద్య పరీక్షలు చేశారు. అందులో ఆయనకు షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్లు తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు జైలు అధికారులు కేజ్రీవాల్ కు మందులు అందజేశారు. జైలులో ఆయనకు రెండు దిండ్లు, దుప్పటి, ఓ పరుపును జైలు అధికారులు ఇచ్చారు. అయితే రాత్రి చాలా సేపటివరకు ఆయన కఠిన నేలపైనే పడుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.
కేజ్రీవాల్ కోరిన పుస్తకాలు అందించిన జైలు సిబ్బంది
అర్థరాత్రి లేచి సెల్‌లో అటు ఇటూ కొద్దిసేపు నడిచినట్లు చెప్పారు. రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని జైలు అధికారులు అనుమతించారు. మంగళవారం ఉదయాన్నే లేచిన కేజ్రీవాల్ కొద్ది సేపు మెడిటేషన్ చేశారు. అనంతరం టీ, రెండు బిస్కట్లు తీసుకున్నారు. కాగా, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా నెలకొనేవరకూ ఇంటి భోజనాన్ని అనుమతిస్తామని జైలు వర్గాలు వెల్లడించాయి. సెల్ బయట వార్డర్ తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు. ఆయన కోరినట్లు జైలులో భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే పుస్తకాలను అందించారు.