Gyanvapi mosque Case: జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వేపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. జులై 26 సాయంత్రం 5గంటల వరకు ఏఎస్‌ఐ సర్వే చేయొద్దని ఆదేశించింది. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను జులై 26 వరకు నిలివేస్తున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మసీదు సముదాయంలో సర్వేపై వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో సోమవారం ఉదయం 7గంటలకు ఏఎస్ఐ బృందం సర్వేను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సర్వేను ప్రారంభించిన కొన్ని గంటలకే సుప్రీంకోర్టు స్టే విధించింది.
జులై 26న అలహాబాద్ హైకోర్టులో విచారణ
జ్ఞానవాపి మసీదులో సర్వేపై జులై 26న విచారణ చేపట్టాలని అలహాబాద్ హైకోర్టును చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మసీదు కమిటీ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదలను వినిపించారు. ఈ క్రమంలో మసీదు స్థలంలో ఎలాంటి పనులు లేదా తవ్వకాలు జరగకూడదని సొలిసిటర్ జనరల్‌కు తెలియజేశారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు హిందూ ఆలయంపై నిర్మించబడిందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు వారణాసి జిల్లా కోర్టు సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే.