DK Shivakumar: 'ఆ ప్రశ్నపై జ్యోతిష్యుడిని అడగండి': కర్ణాటక నాయకత్వ మార్పు అంశంపై డీకే శివకుమార్ వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ దిశగా చర్చలు వేడెక్కుతున్న వేళ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పదవి ఆశించడం సహజమేనని, అందులో తప్పేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పలువురు కాంగ్రెస్ శాసన సభ్యులు క్యాబినెట్‌లో తమకూ అవకాశం ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాట్లాడిన డీకే శివకుమార్.. "పదవిపై ఆశ పెట్టుకోవడం ఎవరి తప్పూ కాదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రులుగా ఎంపిక చేసే హక్కు ముఖ్యమంత్రికే ఉంది. పార్టీ కోసం శ్రమించిన వారికి పదవి ఆశ ఉండటం సహజం. వారిలో చాలా మంది పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
మల్లికార్జున ఖర్గేను కలిసిన సిద్ధరామయ్య
ఈ సమయంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వచ్చిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, "అదే ప్రశ్నను జ్యోతిష్యుడిని వెళ్లి అడగండి" అని సూటి సమాధానం ఇచ్చారు. మరోవైపు, కర్ణాటక కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందన్న వార్తల నడుమ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఖర్గే నివాసంలో ఇద్దరూ విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణే ఈ భేటీకి ప్రధానాంశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
పూర్తి కాలం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య
ఖర్గేతో డీకే శివకుమార్ కూడా ఆదివారం సమావేశమై మాట్లాడిన విషయం తెలిసిందే. "పార్టీ రాష్ట్ర అధ్యక్షుడూ, జాతీయ అధ్యక్షుడూ కలవడం సాధారణమే. ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదు. పార్టీ వ్యవహారాల గురించే మాట్లాడుకున్నాం"అని డీకే ఇప్పటికే స్పష్టం చేశారు. అధిష్ఠానం కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సిద్ధరామయ్య పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది.