Assam: అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత ఈ చట్టానికి ఆమోదం తెలిపిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి ఒకే విధమైన చట్టాన్ని అమలు చేయడమే ఈ బిల్లుకు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. చట్టం అమలుపై సంబంధిత అధికారులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సమాజంలో అనేక అంశాల్లో ఒకే విధమైన విధానం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
వివరాలు
మత భేదాలు లేకుండా అందరికీ ఒకే విధమైన నిబంధనలు
ముఖ్యంగా మహిళల రక్షణ, గౌరవం, సమాన హక్కులను నిర్ధారించడమే ఈ బిల్లులో ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతిలో వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, వీలునామా వంటి అంశాల్లో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించే నిబంధనలు ఉన్నాయి. మత భేదాలు లేకుండా అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సహజీవనం చేసే జంటలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఇందులో స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. సైన్యం, వాయుసేన, నౌకాదళంలో సేవలందిస్తున్నవారికి అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన వీలునామా తయారు చేసుకునే ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే అన్ని మతాలకు చెందిన మహిళలు,పురుషులకు ఒకే కనీస వివాహ వయస్సు అమలు చేయనున్నారు.
వివరాలు
గిరిజనులను మినహాయిస్తూ దీనిని ఏకరీతి చట్టం అని ఎలా అంటారు
బహుభార్యత్వంపై నిషేధం విధించే నిబంధనలను కూడా చట్టంలో చేర్చారు. హలాల్ విధానంపై కూడా నిషేధం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ చట్టంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది భాజపా రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన చర్య అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బాల్య వివాహాలు,విడాకులు,భరణం,బహుభార్యత్వం వంటి అంశాలపై ఇప్పటికే చట్టాలు అమల్లో ఉన్నాయని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత వాజెద్ అలీ చౌదరి పేర్కొన్నారు. వాటిని అమలు చేస్తే సరిపోతుందని,కొత్త చట్టం అవసరం లేదన్నారు. ప్రజల వ్యక్తిగత జీవితాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని విమర్శించారు. గిరిజనులను మినహాయిస్తూ దీనిని ఏకరీతి చట్టం అని ఎలా అంటారని ప్రశ్నించారు.