Himanta: అస్సాంలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్‌పై సీఎం హిమంత పరువునష్టం దావా
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సుమారు 1200 బిఘాల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేతలపై పరువునష్టం దావా వేసినట్లు వెల్లడించారు. ఇటీవల కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం పెట్టి తనపై దురుద్దేశపూర్వకంగా, అసత్య ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు.
వివరాలు
రాష్ట్రంలో మరింత వేడి పెంచుతున్న రాజకీయ ఆరోపణలు
జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగొయ్‌ల నుంచి రూ.500 కోట్ల నష్టపరిహారం కోరుతూ న్యాయపోరాటం ప్రారంభించినట్లు తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ నేత గొగొయ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఇదే అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఓ వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివాదాస్పద వీడియోను అస్సాం భాజపా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ, గువాహటిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రాజకీయ ఆరోపణలు రాష్ట్రంలో మరింత వేడి పెంచుతున్నాయి.