Pawan Khera: సీఎం భార్యపై ఆరోపణలు.. పవన్ ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్యకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, ఆమె ఆస్తులను అఫిడవిట్‌లో వెల్లడించలేదని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపాయి. ఈ ఆరోపణలను ఖండిస్తూ సీఎం సతీమణి రినికి భూయాన్ శర్మ పవన్ ఖేరాపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో అస్సాం పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నేడు దిల్లీలోని పవన్ ఖేరా నివాసానికి చేరుకున్నారు. అయితే, పోలీసులు వెళ్లే సమయానికి ఆయన ఇంట్లో లేకపోవడంతో, ఆయన రాక కోసం అక్కడే వేచి ఉన్నట్లు సమాచారం. అవసరమైతే ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ జరిపే అవకాశముందని తెలుస్తోంది.
వివరాలు
కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ప్రచారం
తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని రిణికి భూయాన్ తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. భారత్‌లో ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదని, అయినప్పటికీ తనకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని ప్రచారం చేయడం నిరాధారమని ఆమె పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.