అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి
అసోంను వరదలు ముంచెత్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 22జిల్లాలు జలమయంగా మారాయి. బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. వరదల కారణంగా అసోంలోని దాదాపు 22 జిల్లాల్లో 4.96 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. తాముల్‌పూర్‌లో వరద నీటిలో మునిగి ఒకరు మృతి చెందారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) నివేదిక ప్రకారం, బజాలీ జిల్లాలో వరద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దాదాపు 2.60 లక్షల మంది ప్రభావితమయ్యారు. నల్బరీలో 77,702 మంది, బార్పేటలో 65,221 మంది, 25,613 మంది, లఖింపూర్, బక్సాలో 24023 మంది, తముల్‌పూర్‌లో 19208 మంది, దర్రాంగ్‌లో 13704 మంది, కోక్రాఝర్ జిల్లాలో 6538 మంది వరదల్లో చిక్కుకుపోయారు.
14,091.90 హెక్టార్లలో నీట మునిగిన పంట
వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 14,091.90 హెక్టార్లలో పంట నీట మునిగింది. తామ్‌పూర్ జిల్లాలోని బజలి, బక్సా, బార్‌పేట, బిస్వనాథ్, బొంగైగావ్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రూఘర్, గోలాఘాట్, హోజై, కమ్రూప్, కోక్రాఝర్, లఖింపూర్, మజులి నాగావ్, నల్బరీ, సోనిత్‌పూర్ జిల్లాలోని 58 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 1366 జలమయంగా మారాయి. జోర్హాట్ జిల్లాలోని నీమతిఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. వరదల కారణంగా చాలా మంది ఎత్తైన ప్రాంతాలు, కట్టలు, కొండలపై ఆశ్రయం పొందుతున్నారు. వరదల కారణంగా 3,46,639 పెంపుడు జంతువులు కూడా దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు.