అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న
బాల్య వివాహాలను అదుపు చేయడంలో అసోం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గువాహటి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో' చట్టాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారని ప్రశ్నించింది. పోక్సో చట్టం కింద అభియోగాలు మోపిన తొమ్మిది మందికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులు కస్టడీ విచారణ అవసరమయ్యే కేసులు కాదని కోర్టు తేల్చి చెప్పింది. దేశంలో బాల్య వివాహాలు చాలా సంవత్సరాలుగా ముఖ్యమైన సమస్యగా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, 2019-2020 మధ్య అస్సాంలో 31.8% బాల్య వివాహాలు నమోదయ్యాయి. అస్సాంలో మాతాశిశు మరణాల రేటు అధికంగా ఉండటానికి బాల్య వివాహాలు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం సృష్టిస్తాయి: హైకోర్టు
అత్యాచార ఆరోపణలు లేని వారిపై పోక్సో చట్టం ఎందుకని జస్టిస్ శ్యామ్ ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం కలిగిస్తాయని చెప్పారు. బాల్య వివాహం అనేది చెడు ఆలోచనేనన్నారు. తమ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తామని, అయితే వారిని అరెస్టు చేసి, జైలులో ఉంచాలా? బయటికి పంపాలా? అనేదే ఇక్కడ సమస్య అని జస్టిస్ శ్యామ్ వ్యాఖ్యానించారు. బాల్య వివాహాల కేసుల్లో అసోంలో 3,000 మంది జైలు జీవితం గడుపుతున్నారు. వారు తమకు జీవనాధారమని, వాళ్లు జైళ్లలో ఉండటం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నయని మహిళలు నిరసనలకు దిగారు. ఫిబ్రవరి 3న, అస్సాం పోలీసులు అధికారికంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అణిచివేతను ప్రారంభించారు.