Telangana Assembly: నేటి నుండి అసెంబ్లీ సెషన్.. చట్ట సవరణలు, ప్రభుత్వ విజయాలపై చర్చ
నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై ప్రకటన చేయనున్నారు. ప్రభుత్వం మొత్తం ఏడు చట్ట సవరణ బిల్లులను, రెండు కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) బిల్లు కీలకంగా ఉండనున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురి సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించే బిల్లుపై కూడా చర్చ జరగనుంది.
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ విస్తృత ఏర్పాట్లు
ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు ఆర్డినెన్స్ 2024 వంటి అంశాలు ప్రధానంగా టేబుల్‌పై ఉంచనున్నారు. జీహెచ్‌ఎంసీ సవరణ ఆర్డినెన్స్ 2024, పురపాలక సంఘాల సవరణ ఆర్డినెన్స్ 2024, 2022-23 సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్, ఆర్థిక సంస్థల వార్షిక నివేదికలను కూడా సభలో ప్రస్తావించనున్నారు. మధ్యాహ్నం బీఏసీ సమావేశంలో సెషన్ వ్యవధి, కార్యకలాపాలు ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వేడుకకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.
లక్షమందికి పైగా హాజరయ్యే అవకాశం
ఆవిష్కరణ కార్యక్రమానికి లక్ష మందికిపైగా హాజరు కావచ్చని అంచనా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. ఆకుపచ్చని చీరలో, చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులతో తెలంగాణ రైతు జీవనాన్ని ప్రతిబింబించేలా దీన్ని డిజైన్ చేశారు. పిడికిలి రూపంలో పోరాట స్ఫూర్తిని చూపించేందుకు విగ్రహానికి ప్రత్యేక శిల్పకళను అందించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి సాంస్కృతిక ప్రదర్శనలు, అతిథులకు మర్యాదపూర్వక స్వాగత ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.