గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే..
హైదరాబద్‌లోని గోషామహల్ బస్తీలో అనూహ్య సంఘటన జరిగింది. ఉన్నట్టుండి పెద్ద నాల కుంగిపోయింది. దీంతో ఆ నాలాపై ఉన్న దుకాణాలు, అక్కడ నిలిపేసిన వాహనాలు అందులోకి పడిపోయాయి. వాహనాలు స్వల్పంగా దెబ్బ తినగా.. కొందరికి గాయాలయ్యాయి. గోషామహల్‌లోని చాక్నవాడిలో ప్రతి శుక్రవారం మార్కెట్ కొనసాగుతుంది. ఈ రోజు కూడా వీధిలో రోడ్డు పక్కన వ్యాపారులు కూరగాయలు, ఇతర వస్తువుల విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా నాలా కుంగిపోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మంత్రి తలసాని, ఎమ్మెల్యే రాజాసింగ్ పరిశీలన
పెద్ద నాలా కుంగిపోయి.. పెద్ద గోతి పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని.. పరిస్థితిని సమీక్షించారు. నాలా కుంగిన సమయంలో అక్కడ రద్దీ చాలా తక్కువగా ఉంది. వాహనాల రాకపోకలు కూడా పెద్దగా లేవు. దీంతో ప్రమాదం తీవ్రత తగ్గినట్లు స్థానికులు చెబుతున్నారు. కుంగిన పెద్దనాలాను ఎమ్మెల్యే రాజాసింగ్ , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. సంఘటన స్థలంలో నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.