T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్: భారత క్రికెట్ ఆటగాళ్ల కీలక రికార్డులు, మైలురాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
2007లో ప్రారంభమైన అంతర్జాతీయ టీ 20 ప్రపంచకప్ నుంచి 2024 వరకు భారత క్రికెట్ ఆటగాళ్లు ప్రపంచ వేదికపై ఎన్నో అద్భుత రికార్డులు సృష్టించారు. బ్యాటింగ్, బౌలింగ్, నాయకత్వం.. అన్ని విభాగాల్లోనూ భారత ఆటగాళ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్ విషయానికి వస్తే, భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు (1,292) చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే 2014, 2016ల్లో రెండుసార్లు 'టోర్నమెంట్ మాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు గెలిచిన ఏకైక ఆటగాడిగా ఘనత దక్కించుకున్నాడు. మరోవైపు, యూవరాజ్ సింగ్ 2007లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి, కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
వివరాలు
బౌలింగ్‌లోనూ సత్తా చాటిన భారత ఆటగాళ్లు
అలాగే మాజీ కెప్టెన్'గా రోహిత్ శర్మ ఇప్పటివరకు 9 టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లలో పాల్గొన్న ఏకైక భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. బౌలింగ్‌లోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఎకానమీ రేట్ (4.17)తో బౌలింగ్ చేసి 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు సొంతం చేసుకున్నాడు. అదే టోర్నీలో అర్ష్‌దీప్ సింగ్ 17 వికెట్లు పడగొట్టి, ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ 32 వికెట్లతో ఈ జాబితాలో కీలక స్థానంలో నిలిచాడు.
వివరాలు
ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా రెండోసారి టైటిల్..
నాయకత్వ పరంగా చూస్తే, 2007లో ఎంఎస్ ధోని నేతృత్వంలో యువ భారత జట్టు తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ విరామం తర్వాత 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా రెండోసారి టైటిల్ సాధించి అరుదైన ఘనత అందుకుంది. సురేశ్ రైనా, రవీంద్ర జడేజాల అద్భుత ఫీల్డింగ్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శన భారత విజయంలో కీలక పాత్ర పోషించాయి. 2026 టీ20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఇప్పటివరకు భారత ఆటగాళ్లు నెలకొల్పిన ఈ రికార్డులు రాబోయే తరం క్రికెటర్లకు గొప్ప ప్రేరణగా నిలవనున్నాయి.