LOADING...
Medaram: నేటి నుంచి మేడారం మహాజాతర.. గద్దెలపై కొలువుదీరనున్న సమ్మక్క-సారలమ్మ
నేటి నుంచి మేడారం మహాజాతర.. గద్దెలపై కొలువుదీరనున్న సమ్మక్క-సారలమ్మ

Medaram: నేటి నుంచి మేడారం మహాజాతర.. గద్దెలపై కొలువుదీరనున్న సమ్మక్క-సారలమ్మ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే అతి విశాలమైన గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైంది. రెండేళ్లకోసారి అపూర్వ వైభవంతో నిర్వహించే ఈ జాతరలో కోట్లాది భక్తుల ఆరాధ్యదైవాలైన సమ్మక్క-సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరనున్నారు. బుధవారం ప్రారంభమయ్యే ఈ మహాజాతర ఈ నెల 31 వరకు ఘనంగా సాగనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లను వెచ్చించి తల్లుల గద్దెల ప్రాంతాన్ని పూర్తిగా పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించింది. తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు, ఇతర భక్తులు కలిపి కోటి మందివరకు మేడారానికి తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

సారలమ్మ ఆగమనంతో జాతర ఆరంభం

మేడారం మహాజాతర తొలి రోజైన బుధవారం కన్నెపల్లి జాబిల్లిగా పూజలు అందుకునే సారలమ్మ మేడారానికి రానున్నారు. ముందుగా మేడారం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం జంపన్న వాగు మీదుగా సారలమ్మను గద్దె ప్రాంగణానికి తీసుకువచ్చి కొలువుదీరుస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సారలమ్మ తండ్రి పగిడిద్దరాజును తీసుకొని ఇప్పటికే కాలినడకన మేడారానికి ప్రయాణం ప్రారంభమైంది. అలాగే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకురానున్నారు. ఈ ముగ్గురు దేవతలు గద్దెలపై కొలువుదీరనున్నారు. మంగళవారం సాయంత్రానికే జంపన్నను కన్నెపల్లి నుంచి జంపన్న వాగు ఒడ్డుకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు.

వివరాలు 

కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం

జాతరలో అత్యంత ప్రాధాన్యమైన ఘట్టం వనదేవత సమ్మక్క ఆగమనం. గురువారం కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలుకల గుట్టపై నుంచి సమ్మక్కను తీసుకువస్తారు. కుంకుమభరిణి రూపంలో సమ్మక్క రాక సందర్భంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు తల్లులను దర్శించుకుని ఎత్తు బంగారాలను సమర్పిస్తారు. శనివారం దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

Advertisement

వివరాలు 

సాంకేతికతకు చిరునామాగా మేడారం

ఈసారి మేడారం మహాజాతరలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేశారు. పోలీసులు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థలను వినియోగంలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు ఏఐ సాంకేతికతను తొలిసారిగా అమలు చేస్తున్నారు. రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్యుత్తు, గిరిజన సంక్షేమ, దేవాదాయ, పోలీసు, ఆర్టీసీ, వైద్య, అగ్నిమాపక శాఖలతో పాటు మొత్తం 21 ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. నెల రోజుల ముందుగానే భక్తుల రాక ప్రారంభమవగా, ఇప్పటివరకు సుమారు 50 లక్షల మంది దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

వివరాలు 

మేడారానికి పయనమైన పగిడిద్దరాజు

గంగారం, న్యూస్‌టుడే: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో కొలువైన వనదేవత సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం మహాజాతరకు బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున పూజారి పెనుక రాజేశ్వర్ ఆధ్వర్యంలో పగిడిద్దరాజు ఆలయాన్ని శుద్ధి చేసి, మామిడి తోరణాలతో అలంకరించారు. ఆడపడుచులు గుడి ప్రాంగణంలో అందమైన ముగ్గులు వేశారు. అనంతరం గ్రామానికి చెందిన పెనుక వెంకటేశ్వర్లు ఇంటి నుంచి పాన్పు రూపంలో ఉన్న పగిడిద్దరాజును శివసత్తుల పూనకాలు, డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పూజారులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి, ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు.

వివరాలు  

మేడారానికి పయనమైన పగిడిద్దరాజు

తరువాత పగిడిద్దరాజును పడగ రూపంలో పెళ్లికొడుకుగా అలంకరించి, పూజారులు పెనుక రాజేశ్వర్, సురేందర్, సమ్మయ్య, రామస్వామి, పురుషోత్తం, రాహుల్ తదితరులు అడవి మార్గంలో సుమారు 62 కిలోమీటర్ల దూరంలోని మేడారానికి కాలినడకన బయలుదేరారు. మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో విశ్రాంతి తీసుకోగా, బుధవారం సాయంత్రానికి మేడారానికి చేరుకోనున్నారు.

Advertisement