LOADING...
Supreme Court: 'ఇది దారుణం'.. టీవీకే ఎమ్మెల్యేపై హైకోర్టు ఆదేశాలకు సుప్రీంకోర్టు బ్రేక్.. 
'ఇది దారుణం'.. టీవీకే ఎమ్మెల్యేపై హైకోర్టు ఆదేశాలకు సుప్రీంకోర్టు బ్రేక్..

Supreme Court: 'ఇది దారుణం'.. టీవీకే ఎమ్మెల్యేపై హైకోర్టు ఆదేశాలకు సుప్రీంకోర్టు బ్రేక్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే ఎమ్మెల్యే ఆర్. శ్రీనివాస సేతుపతిని అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొనకుండా నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బుధవారం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టు తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "ఇది చెప్పాలంటే దారుణం" అంటూ వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యే సేతుపతి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికల పిటిషన్ ద్వారానే పరిష్కారం ఉందని చెబుతూ.. అదే సమయంలో ఆర్టికల్ 226 కింద పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం సరైంది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

వివరాలు 

ఓట్ల లెక్కింపులో అవకతవకలు

ఈ కేసులో హైకోర్టులో కొనసాగుతున్న విచారణపై కూడా స్టే ఇచ్చింది. శివగంగై జిల్లాలోని తిరుపత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున పోటీ చేసిన శ్రీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో డీఎంకే నేత, మాజీ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్‌పై విజయం సాధించారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, మరో నియోజకవర్గానికి వెళ్లిన పోస్టల్ బ్యాలెట్‌ను తప్పుగా తిరస్కరించారని ఆరోపిస్తూ పెరియకరుప్పన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

వివరాలు 

పెరియకరుప్పన్ కు సుప్రీంకోర్టు రెండు వారాల సమయం

ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. సేతుపతి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్, విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం వంటి ఓటింగ్ ప్రక్రియల్లో పాల్గొనకుండా ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. సేతుపతి పిటిషన్‌పై డీఎంకే నేత పెరియకరుప్పన్ తదితరులు తమ సమాధానం దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది.

Advertisement