Medak : మెదక్ జిల్లాలో దారుణం.. మూడేళ్ల కుమారుడిని హత్య చేసిన తండ్రి
ఈ వార్తాకథనం ఏంటి
మెదక్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తనకు పుట్టలేదన్న అనుమానంతో తండ్రే కన్న కుమారుడిని హత్య చేసిన విషాద ఘటన మెదక్ మండలంలోని పెద్దబాయి తండాలో ఆదివారం వెలుగుచూసింది. మెదక్ గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దబాయి తండాకు చెందిన బదావత్ భాస్కర్‌కు అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Details
తనకు పుట్టలేదన్న అనుమానంతోనే హత్య
ఈ క్రమంలో శుక్రవారం భాస్కర్ తన భార్యను తీవ్రంగా కొట్టాడు. గాయపడిన ఆమె మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సమయంలో మూడేళ్ల బాలుడు రెండు రోజులుగా తండ్రి వద్దే ఉన్నాడు. ఈ నేపథ్యంలో బాలుడు తనకు పుట్టలేదన్న అనుమానంతో భాస్కర్ తాడుతో కుమారుడి గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే మెదక్ గ్రామీణ ఠాణా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.