Jaishankar Iran Visit: భారత నౌకలపై దాడులు ఆందోళన కలిగించే విషయం: జైశంకర్
ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దాడులు భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఏ పక్షానికి లాభదాయకం కాదని అన్నారు. టెహ్రాన్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లాహియాన్‌తో చర్చల అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అంశాన్ని జైశంకర్ లేవనెత్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయన్నారు. ఇలాంటి దాడుల దృష్ట్యా ఈ అంశాలపై చర్చ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
పశ్చిమాసియాలో హింసపై ఆందోళన
భారత్ సముద్ర తీరంలో ఇటీవల కొన్ని దాడులను జరిగాయని, ఇవి తమకే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా ఆందోళన కలిగించే అంశమని జైశంకర్ అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై భారత్, ఇరాన్‌లు ఆందోళన చెందుతున్నాయని జైశంకర్ అన్నారు. ఈ ప్రాంతంలో హింస పెరగకుండా నిరోధించడంలో రెండు దేశాల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. హమాస్‌పై ఇరాక్ చర్యల వల్ల గాజాలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, దీన్ని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. గాజాలో అమాయక మహిళలు, చిన్నారులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మానవ కారిడార్ అవసరమని కూడా ఆయన అన్నారు.