Australia: ECTA ఒప్పందం కింద 2026 జనవరి నుంచి భారత ఎగుమతులపై ఆస్ట్రేలియా టారిఫ్‌లు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ECTA) కింద 2026 జనవరి 1 నుంచి భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని ఎగుమతులపై టారిఫ్‌లు పూర్తిగా రద్దు చేయనున్నట్లు ఆస్ట్రేలియా నిర్ణయించింది. దీంతో ఆస్ట్రేలియాలో ఉన్న 100 శాతం టారిఫ్ లైన్లు జీరో డ్యూటీకి మారనున్నాయి. ఈ నిర్ణయంతో భారత ఎగుమతులకు గణనీయమైన ఊతం లభించనుంది. ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మూడో వార్షికోత్సవం సందర్భంగా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల భారత్‌లోని కార్మికాధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని ఆయన తెలిపారు.
వివరాలు
16 శాతం పెరిగిన రత్నాలు-ఆభరణాల ఎగుమతులు
గత మూడు సంవత్సరాలుగా ఈ ఒప్పందం ద్వారా ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధి,మార్కెట్ యాక్సెస్ పెరుగుదల,సరఫరా గొలుసు బలోపేతం జరిగిందని గోయల్ పేర్కొన్నారు. దీని వల్ల భారత ఎగుమతిదారులు,ఎంఎస్ఎంఈలు, రైతులు, కార్మికులు అందరూ లాభపడుతున్నారని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తయారీ రంగం,రసాయనాలు,టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్, ఔషధాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు-ఆభరణాల రంగాలు ఈ ఒప్పందం వల్ల ఎక్కువగా లాభపడ్డాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య రత్నాలు-ఆభరణాల ఎగుమతులు 16 శాతం పెరిగినట్లు వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియాకు భారత్ ఎగుమతులు 8 శాతం పెరిగాయి. దీనివల్ల ఆ దేశంతో భారత్ వాణిజ్య లోటు కూడా కొంత మేర మెరుగుపడింది.
వివరాలు
భారత్-ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం
2022 డిసెంబర్‌లో అమల్లోకి వచ్చిన ECTA ఒప్పందం లక్ష్యం, టారిఫ్‌లను దశలవారీగా తొలగించడం, మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, సరఫరా గొలుసుల సమన్వయాన్ని పెంచడం ద్వారా భారత్-ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడం. అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో ఒడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో, భారత్ కొత్త ఎగుమతి గమ్యస్థానాల వైపు దృష్టి పెడుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ పాలనలో 2025 ఆగస్టు 27 నుంచి భారత్ అమెరికాకు చేసే ఎగుమతులపై 50 శాతం టారిఫ్ చెల్లిస్తోంది, ఇది భారత ఎగుమతిదారులకు భారంగా మారింది.