Rammohan Naidu: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో విమాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇండిగో కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుతున్నాయని తెలిపారు. ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత ఇండిగో సంస్థదేనని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యాల పరిరక్షణ కోసం దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నామని వివరించారు. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో వేల సంఖ్యలో ఇండిగో విమానాలు నిలిచిపోవడంతో, వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ఈ రోజు ప్రకటన చేశారు.
వివరాలు
సంస్థ సీఈవోకు షోకాజ్ నోటీసులు
ఇండిగో సంక్షోభానికి సంబంధించి సమగ్రస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సంస్థ సీఈవోకు షోకాజ్ నోటీసులు పంపినట్లు చెప్పారు. ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా ప్రయాణం చేయడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై డీజీసీఏ (DGCA)కూ నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఇండిగో ప్రయాణికులకు సుమారు రూ.750 కోట్లను రిఫండ్‌గా చెల్లించిందని చెప్పారు. ఇకపై కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని ఇండిగో హామీ ఇచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు.