LOADING...
Aviation ministry: రెండు కొత్త విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి.. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌కు ఎన్వోసీలు మంజూరు
అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌కు ఎన్వోసీలు మంజూరు

Aviation ministry: రెండు కొత్త విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి.. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌కు ఎన్వోసీలు మంజూరు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు కొత్త విమానయాన సంస్థలకు అధికారిక అనుమతి లభించింది. అల్ హింద్ ఎయిర్,ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు (ఎన్వోసీలు) జారీ చేసింది. ఇప్పటికే ఎన్వోసీ పొందిన శంఖ్ ఎయిర్‌తో కలిసి,ఈ మూడు సంస్థలు కొత్త ఏడాది నుంచి విమాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం వెల్లడించారు. భారత విమానయాన రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్న శంఖ్ ఎయిర్,అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థల ప్రతినిధులను గత కొన్ని రోజులుగా కలవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

వివరాలు 

ఉత్తరప్రదేశ్ కేంద్రంగా శంఖ్ ఎయిర్ కార్యకలాపాలు 

శంఖ్ ఎయిర్ ఇప్పటికే మంత్రిత్వ శాఖ నుంచి ఎన్వోసీ పొందిందని, ఇక అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలకు ఈ వారం అనుమతులు లభించాయని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా,ఉత్తరప్రదేశ్ కేంద్రంగా శంఖ్ ఎయిర్ తన కార్యకలాపాలను నిర్వహించనుంది. కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ అల్ హింద్ ఎయిర్‌ను ప్రమోట్ చేస్తోంది. ఈ రెండు సంస్థలతో పాటు ఫ్లైఎక్స్‌ప్రెస్ కూడా 2026లో తొలుత దేశీయ విమాన సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

వివరాలు 

అక్టోబర్ నెలలో విమాన సేవలను నిలిపేసిన ఫ్లై బిగ్

మరోవైపు, ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై బిగ్ అక్టోబర్ నెలలో తన విమాన సేవలను నిలిపివేసింది. ఈ పరిణామంతో ప్రస్తుతం దేశంలో తొమ్మిది దేశీయ విమానయాన సంస్థలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే మార్కెట్ పరంగా చూస్తే, ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల కలిపిన వాటా 90 శాతానికి మించిపోయింది.

Advertisement