Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
సామాన్య భక్తులందరికీ అయోధ్యలోని నవ్య రామాలయం తలుపులు తెరుచుకున్నాయి. రామాలయంలో మంగళవారం నుంచి బాల రాముడు సామాన్య భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దీంతో శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రామాలయ ప్రధాన ద్వారం వద్ద తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడ్డారు. అయోధ్యలోని రామ మందిరం తలుపులను ప్రతిరోజూ రెండు సమయాల్లో తెరుస్తారు. ఉదయం 7 నుంచి 11:30 వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు శ్రీరాముడు దర్శనం ఇవ్వనున్నారు. మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని దివ్యమందిరంలో ప్రతిష్టించారు.
ధ్వంసమైన బారికేడ్లు
ఆలయానికి 12 ప్రవేశాల ద్వారాలు ఉన్నాయి. వాటిలో భక్తుల ప్రవేశానికి సింగ్ ద్వార్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో వారిని అదుపు చేయడం కోసం పోలీసులు ఇబ్బందులు పడ్డారు. తొలిరోజు దేశ నలుమూలలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి ఎక్కువ మంది భక్తులు వచ్చినట్లు ఆలయ ఆధికారులు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే భక్తుల రద్దీ పెరగడంతో కొన్నిచోట్ల బారికేడ్లు ధ్వంసమైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.