Page Loader
Ram Lalla Idol: 250కోట్ల ఏళ్ల నాటి శిలతో అయోధ్య శ్రీరాముడి విగ్రహం.. ఆ రాతి ప్రత్యేకతలు ఇవే
Ram Lalla Idol: 250కోట్ల ఏళ్ల నాటి శిలతో అయోధ్య శ్రీరాముడి విగ్రహం.. ఆ రాతి ప్రత్యేకతలు ఇవే

Ram Lalla Idol: 250కోట్ల ఏళ్ల నాటి శిలతో అయోధ్య శ్రీరాముడి విగ్రహం.. ఆ రాతి ప్రత్యేకతలు ఇవే

వ్రాసిన వారు Stalin
Jan 23, 2024
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముదురు రంగు, అందమైన చిరునవ్వు, ప్రకాశవంతమైన కళ్లతో అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహం ఏ రాతితో తయారు చేసారు? ఆ రాయి వయసు ఎంత ఉండొచ్చు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో.. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (NIRM)సమాధానమిచ్చింది. అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని 250కోట్ల సంవత్సరాల నాటి బ్లాక్ గ్రానైట్‌తో తయారు చేసినట్లు ఎన్‌ఐఆర్‌ఎం చెప్పింది. అతి పురాతనమైన కృష్ణ శిలతో శ్రీరాముడి విగ్రహాన్ని చేసినట్లు వెల్లడించింది. బ్లాక్ గ్రానైట్‌ను కృష్ణ శిల అని కూడా పిలుస్తారు. ఎన్‌ఐఆర్‌ఎం అనేది భారతీయ ఆనకట్టలు, అణు విద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించడానికి ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీ.

అయోధ్య

వేల ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా..

అసలు రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు శిల్పి అరుణ్ యోగిరాజ్ కర్ణాటకకు చెందిన ఈ కృష్ణ శిలను ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న చాలా మందిలో మెదులుతోంది. శ్రీరాముడి విగ్రహం తయారీలో ఉపయోగించిన బ్లాక్ గ్రానైట్‌ను తొలుత ల్యాబ్‌లో పరీక్షించారు. బెంగళూరులోని ఎన్‌ఐఆర్‌ఎం ఈ బ్లాక్ గ్రానైట్‌కు ల్యాబ్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్ష నివేదిక వెలువడగానే ఎన్‌ఐఆర్‌ఎం డైరెక్టర్‌ హెచ్‌ఎస్‌ వెంకటేష్‌ షాక్‌కు గురయ్యారు. ఈ బ్లాక్ గ్రానైట్ 2.5 బిలియన్ సంవత్సరాల( 250 కోట్ల ఏళ్లు) నాటిదని ఆయన ధృవీకరించారు. ఈ రాయి అత్యంత మన్నికైనది, ఎలాంటి వాతావరణ మార్పులనైనా తట్టుకోగలదని ఆయన చెప్పారు. వేల ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఈ రాయి ప్రకాశవంతంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

అయోధ్య

ఈ శిల వయస్సు.. భూమి వయస్సులో సగం

శ్రీరాముడి విగ్రహం కోసం వినియోగించిన కృష్ణ శిల గురించి కేంద్ర సైన్స్ మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేయడానికి కర్నాటక మైసూర్ జిల్లాలోని జయపురా హోబ్లీ గ్రామం నుంచి గ్రానైట్‌ను సేకరించామన్నారు. ఇది గనులలో దొరుకుతుందని చెప్పారు. ఈ నల్ల గ్రానైట్ బిలియన్ల సంవత్సరాల క్రితం నాటి కేంబ్రియన్ పూర్వ యుగానికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా భూమి 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే భూమి వయసులో బ్లాక్ గ్రానైట్ వయస్సు సగం ఉంటుందన్న మాట.

అయోధ్య

గని నుంచి తీసినప్పుడు మెత్తగా.. తర్వాత గట్టిగా..

కర్ణాటకలోని మైసూర్‌లో లభించే బ్లాక్ గ్రానైట్ ఎలాంటి వాతవరణాన్ని అయినా తట్టుకుంటుంది. ఈ రాయి ప్రత్యేకత ఏంటంటే.. గని నుంచి బయటకు తీసినప్పుడు మెత్తగా ఉంటుంది.. 2-3 సంవత్సరాల్లో క్రమంగా గట్టిగా మారుతుంది. ఈ రాయి నీటిని గ్రహించదు. కార్బన్‌ కూడా దీన్ని ఆకర్షించదు. శ్రీకృష్ణుని రంగును పోలి ఉండడం వల్ల ఆ రాళ్లను కృష్ణ శిల అంటారు. ఈ రాయి గని నుంచి తీయగానే.. మెత్తగా.. లక్క మాదిరిగా ఉంటుంది. దీని వల్ల శిల్పికి దీన్ని చెక్కడం చాలా సులభం అవుతుంది. దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లోని చాలా దేవుళ్ళ, దేవతల విగ్రహాలు నెల్లికారు రాళ్లతో తయారు తాయారు చేశారు. నల్ల రాయిని చాలా అరుదుగా వినియోగిస్తుంటారు.