అయోధ్యలోని శ్రీరాముడి ఆలయం వద్ద రూ. 100 కోట్లతో 'లోటస్ ఫౌంటెన్' ఏర్పాటు
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిర సముదాయం సమీపంలో రూ. 100కోట్లతో మెగా 'మల్టీమీడియా షో ఫౌంటెన్' నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధ చేసింది. ఈ ఫౌంటెన్‌ను లోటస్( తామరపువ్వు) ఆకారంలో ఒకసారి దాదాపు 25,000 మంది వీక్షించేలా నిర్మించనున్నారు. గుప్తర్ ఘాట్ నుంచి నయా ఘాట్ వరకు 20 ఎకరాల్లో ఈ ఫౌంటెన్ నిర్మించేందుకు యోగి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు 50మీటర్ల ఎత్తుకు నీరు వెళ్లేలా దీన్ని తయారు చేయనున్నారు. ఈ ఫౌంటెన్ కాంప్లెక్స్ దైవిక, ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ప్రత్యేకంగా నిర్మించనున్నారు. ఇది శ్రీరామ ఆలయ వైభవాన్ని మరింత పెంచుతుందని యూపీ ప్రభుత్వం భావిస్తోంది.
తామరపువ్వు ఆకారంలో నిర్మించడానికి కారణం ఇదే..
శ్రీరామ మందిరం నిర్మాణంలో భాగంగా నీటి మూలకాల ప్రత్యేక ప్రాముఖ్యతకు కొత్త గుర్తింపునిచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ఫౌంటెన్‌ను నిర్మిస్తున్నారు. అంతేకాదు, ఈ ప్రదేశాన్ని రాముడి పురాణ కథను చెప్పడానికి ఇది తగిన ప్రదేశంగా కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ ఫౌంటెన్ యాత్రికులు, పర్యాటకులకు మరపురాని అనుభూతిని ఇస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఫౌంటెన్‌ను తామరపువ్వు ఆకారంలో నిర్మించడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. హిందూ మతంలోని ఏడు పవిత్ర నదులైన గంగా, యమునా, సరస్వతి, సింధు, నర్మద, గోదావరి, కావేరికి ప్రతీక కమలం పువ్వులోని ఏడు రేకులు అని చెబుతుంటారు. ఫౌంటెన్‌లోని మధ్య పుష్పాన్ని ఏర్పరుచుకున్న ఏడు రేకులు విష్ణువు 7వ అవతారమైన శ్రీరాముడిని సూచిస్తాయని పురాణ పత్రాలు చెబుతున్నాయి.