Telangana: కారాగారాల్లో ఆయుర్వేద చికిత్సాలయాలు.. చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఏర్పాటుకు సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని కారాగారాల్లో మళ్లీ ఆయుర్వేద చికిత్సా కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైదీలకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఈ సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో చంచల్‌గూడ కేంద్ర కారాగారం,చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో ఈ కేంద్రాలను తిరిగి ప్రారంభించేందుకు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో చంచల్‌గూడ,వరంగల్ కేంద్ర కారాగారాలు,సంగారెడ్డి జైలు,చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో 'మై నేషన్ ఆయుర్వేదిక్ విలేజ్' పేరుతో ఆయుర్వేద చికిత్సలు అందుబాటులో ఉండేవి. మొదట చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ప్రారంభించిన ఈ సేవలకు నెలకు సగటున రూ.3 లక్షల వరకు ఆదాయం లభించడంతో, తరువాత ఇతర జైళ్లకు కూడా విస్తరించారు.
వివరాలు
కరోనా కాలంలో మూతపడిన వాటి పునరుద్ధరణ
అయితే కరోనా మహమ్మారి సమయంలో ఈ కేంద్రాల్లో చికిత్సలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. తరువాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ,అప్పటివరకు శిక్షణ పొందిన ఖైదీలు విడుదల కావడం,అలాగే వైద్య సిబ్బంది ఇతర ప్రాంతాల్లో విధుల్లో చేరడం వల్ల ఈ కేంద్రాలు మళ్లీ ప్రారంభం కాలేకపోయాయి. ఇటీవల ఈ అంశంపై స్పందించిన జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా,ఆయుర్వేద చికిత్సా కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
కేరళకు చెందిన నిపుణ వైద్యులకు ప్రాధాన్యం
అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో పంచకర్మ చికిత్సలు, అలాగే సాధారణ ఆయుర్వేద థెరపీ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి కేంద్రంలో ఒక వైద్యుడు, ఇద్దరు పురుష సిబ్బంది, ఒక మహిళా సిబ్బందిని నియమించాలనే ఆలోచన ఉంది. చికిత్సల కోసం కేరళకు చెందిన నిపుణ వైద్యులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సిబ్బందిని మాత్రం ఖైదీల నుంచే ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి నియమించేందుకు చర్యలు తీసుకోనున్నారు.