Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అనుమానాలు!
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శనివారం రాత్రి ముగ్గురు దుండగులు ఆయనపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యులు కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఆ గ్యాంగ్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం సబర్మతి జైలులో ఉన్నారు. ముంబై పోలీసులు ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారీలో ఉన్నారు. అదుపులో ఉన్నవారిని కర్నైల్ సింగ్ (హర్యానా), ధరం రాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్) గా గుర్తించారు.
సిద్ధిఖీ కుమారుడి వద్ద రెక్కీ చేసిన పోలీసులు
హత్యకు ముందు నెలరోజుల పాటు దుండగులు బాంద్రాలో సిద్ధిఖీ కుమారుడి ఇంటి వద్ద రెక్కీ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముగ్గురు దుండగులు ఆటోలో బాంద్రాకు చేరుకొని, సిద్ధిఖీ రాక కోసం వేచిచూశారు. ఆయన రాగానే మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్యకు సంబంధముందని పోలీసులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సిద్ధిఖీ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సన్నిహితుడు. సల్మాన్‌కు గతంలో బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులొచ్చాయి. సిద్ధిఖీ 15 రోజుల క్రితం తనకు ప్రాణహాని ఉందని, వై కేటగిరీ భద్రత కల్పించాలని అధికారులను కోరినట్లు అతని సన్నిహితులు తెలిపారు.