Palnadu: పంచాయతీ ఎన్నికల వేళ పల్నాడులో భారీ హింసకు ప్లాన్.. బాలకృష్ణ పీఏ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తతలు సృష్టించి, ప్రత్యర్థి వర్గాలను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మొత్తం 66 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 కార్లు, 4 వేటకొడవళ్లు, 60 కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ), స్థానిక టీడీపీ నేత పావులూరి శ్రీనివాసరావు వర్గీయులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.
వివరాలు
100 మందికి మద్యం, భోజన ఏర్పాట్లు
నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావు గుంటూరు నుంచి సుమారు 100 మందిని 22 కార్లలో ఎలాంటి అనుమతులు లేకుండా తిమ్మాపురం గ్రామానికి తీసుకొచ్చారు.
అక్కడి ఓ కంపెనీలో వారికి మద్యం, భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారిలో కొందరికి వేటకొడవళ్లు, కర్రలు అందించి సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు.
వివరాలు
అదుపులో 66 మంది
22 కార్లతో వెళ్తున్న వాహనశ్రేణిని అడ్డుకుని, మొత్తం 66 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని నాదెండ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు.
గ్రామంలో టీడీపీలోని వర్గ విభేదాలే ఈ ఘటనకు కారణమని ఏఎస్పీ హనుమంతరావు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.