LOADING...
Bandi jackets and beret: భారత సైన్యంలో కొత్త యూనిఫాం కోడ్.. బండి జాకెట్లు, బెరెట్ టోపీలు.. బ్రిటిష్ ఆనవాళ్లకు చెక్!
భారత సైన్యంలో కొత్త యూనిఫాం కోడ్.. బండి జాకెట్లు, పాత సంప్రదాయాలకు గుడ్‌బై

Bandi jackets and beret: భారత సైన్యంలో కొత్త యూనిఫాం కోడ్.. బండి జాకెట్లు, బెరెట్ టోపీలు.. బ్రిటిష్ ఆనవాళ్లకు చెక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైన్యం యూనిఫాం నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా,బ్రిటిష్ పాలన కాలం నుంచి కొనసాగుతున్న కొన్ని సంప్రదాయాలకు ముగింపు పలుకుతూ "ఆర్మీ యూనిఫామ్స్-2026" పేరుతో 174 పేజీల కొత్త మాన్యువల్‌ను విడుదల చేసింది. సైన్యం గౌరవం,క్రమశిక్షణ,సంప్రదాయాలను కాపాడుతూనే భారతీయ భావజాలానికి అనుగుణంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఎనిమిదేళ్ల తర్వాత యూనిఫాం నిబంధనల్లో ఈ సమగ్ర సవరణలు చోటుచేసుకున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం శీతాకాలం కోసం అన్ని హోదాల సైనికులకు"3బీ"పేరుతో కొత్త డ్రెస్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో అంగోలా షర్ట్, బ్యాటిల్ జాకెట్, బెరెట్ టోపీ ఉంటాయి. ప్రస్తుతం వాడుతున్న జెర్సీ ఆధారిత వింటర్ యూనిఫాంను దశలవారీగా తొలగించి, 2029 జూన్ నాటికి బ్యాటిల్ జాకెట్‌ను పూర్తిగా అమల్లోకి తీసుకురానున్నారు.

వివరాలు 

మహిళా అధికారుల దుస్తుల విషయంలో కూడా కొత్త మార్గదర్శకాలు జారీ

అధికారిక కార్యక్రమాల్లో పూర్తి చేతుల చొక్కాపై క్లోజ్డ్ నెక్ కోటు లేదా బండి జాకెట్ ధరించేందుకు అనుమతి ఇచ్చారు. ఇది సాధారణ,గంభీరమైన రంగులో ఉండాలని, దానికి సరిపోయే ఫార్మల్ ప్యాంట్,షూస్ ధరించాలని మాన్యువల్‌లో పేర్కొన్నారు. మహిళా అధికారుల దుస్తుల విషయంలో కూడా కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. సాధారణ రంగుల్లో చీరలు లేదా కుర్తా-సల్వార్, డుపట్టాతో కూడిన స్ట్రెయిట్ ప్యాంట్లు ధరించవచ్చు. అయితే స్లీవ్‌లెస్ కుర్తాలు,పలాజోలు,సిగరెట్ ప్యాంట్లు వంటి క్యాజువల్ దుస్తులను నిషేధించారు. మెస్ డ్రెస్ నంబర్-5, నంబర్-6లలో ధరించే సంప్రదాయ పౌచ్ బెల్ట్‌ను తొలగించారు. అయితే కొన్ని ప్రత్యేక రెజిమెంట్లలో కల్నల్ హోదా వరకు ఉన్న అధికారులకు రెజిమెంటల్ వేడుకల్లో ఈ బెల్ట్‌ను ధరించే అవకాశం ఉంటుంది.

వివరాలు 

సైనికులు కత్తులు ధరించే సందర్భాలను పరిమితం చేశారు

అలాగే బ్రిటిష్ కాలం నుంచి వాడుతున్న "రాయల్" అనే పదాన్ని కూడా అధికారికంగా తొలగించారు. సైనికులు కత్తులు ధరించే సందర్భాలను కూడా పరిమితం చేశారు. ఇకపై రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం, ఆర్మీ డే పరేడ్‌లు, గార్డ్స్ ఆఫ్ హానర్ వంటి ప్రధాన వేడుకల్లో మాత్రమే పరేడ్ కమాండర్లు, కంటింజెంట్ కమాండర్లు, నియమిత సిబ్బంది కత్తులు ధరించనున్నారు. రివ్యూయింగ్ అధికారులు పరేడ్ సమయంలో కత్తులు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

వ్యక్తిగత అలంకరణల విషయంలోనూ కఠిన నిబంధనలు

వ్యక్తిగత అలంకరణల విషయంలోనూ కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. టాటూలు, శరీరంపై పియర్సింగ్‌లు పూర్తిగా నిషేధం. మీసాల పొడవు 12 సెంటీమీటర్లకు మించకూడదు. యూనిఫాంలో డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్‌లు వాడకూడదు. అయితే ఆఫ్టర్ షేవ్ లోషన్లు ఉపయోగించుకోవచ్చు. మహిళా సిబ్బంది లిప్‌స్టిక్, రంగు నెయిల్ పాలిష్, బొట్టు, ముక్కుపుడక ధరించరాదు. సింధూరం ధరించేందుకు అనుమతి ఉన్నప్పటికీ, అది బెరెట్ లేదా క్యాప్ కింద నుంచి కనిపించకూడదు. సిక్కు సైనికులు మినహా మతపరమైన గుర్తులు, చిహ్నాలను ధరించేందుకు అనుమతి లేదు. పూజ రోజు మాత్రమే చేతికి ఒక పవిత్ర దారాన్ని కట్టుకోవచ్చు.

Advertisement

వివరాలు 

246 రహదారులు, భవనాలు, ఇతర ప్రాంగణాల పేర్ల మార్పు 

ఇటీవలి కాలంలో భారత సైన్యం బ్రిటిష్ పాలనా కాలం నుంచి కొనసాగుతున్న అనేక సంప్రదాయాలకు స్వస్తి పలుకుతోంది. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ పాతకాలపు, ఉపయోగం కోల్పోయిన విధానాలను వదిలేయాలని సూచించిన తర్వాత ఈ మార్పులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే గుర్రపు బగ్గీల వినియోగం, కొన్ని రిటైర్మెంట్ వేడుకల సంప్రదాయాలు, పైప్ బ్యాండ్ కార్యక్రమాలను నిలిపివేసిన సైన్యం, ఈ ఏడాది 246 రహదారులు, భవనాలు, ఇతర ప్రాంగణాల పేర్లను కూడా మార్చింది. ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన "ఆర్మీ యూనిఫామ్స్-2026" మాన్యువల్ ద్వారా యూనిఫాం నిబంధనలను సరళీకరించడం, ఆధునికీకరించడం, అదే సమయంలో భారతీయ సంస్కృతి, సైనిక సంప్రదాయాలను సమన్వయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత సైన్యం వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత సైన్యంలో కొత్త యూనిఫాం కోడ్.. బండి జాకెట్లు, పాత సంప్రదాయాలకు గుడ్‌బై

Advertisement