LOADING...
Telangana: సిట్ విచారణకు హాజరుకాలేకపోతున్నానని బండి సంజయ్ లేఖ!
సిట్ విచారణకు హాజరుకాలేకపోతున్నానని బండి సంజయ్ లేఖ!

Telangana: సిట్ విచారణకు హాజరుకాలేకపోతున్నానని బండి సంజయ్ లేఖ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కోరారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా సోమవారం (జూలై 29) సిట్ విచారణకు హాజరుకాలేనని బండి సంజయ్‌ లేఖ ద్వారా అధికారులకు తెలియజేశారు. 'ఆపరేషన్‌ సింధూర్' అంశంపై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకాలేకపోతున్నానని లేఖలో స్పష్టం చేశారు. అయితే త్వరలోనే తాను హాజరయ్యే తేదీని తెలియజేస్తానని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారనే ఆరోపణలతో బండి సంజయ్‌ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సాక్షిగా మారిన విషయం తెలిసిందే.

Details

200 మంది స్టేట్ మెంట్లు రికార్డు

దీనితో ఆయనను విచారించేందుకు సిట్ అధికారులు ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ చేపట్టిన విచారణలో అనేక కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు ఫోన్ నుంచి పలు రికార్డింగులు లభించాయి. ఆయన చాట్ హిస్టరీలో ట్యాపింగ్‌కు సంబంధించిన సందేశాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఇప్పటివరకు సిట్ దాదాపు 200 మంది స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది. ట్యాపింగ్ లిస్ట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాజగోపాల్, వివేక్‌ తదితరుల పేర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో రెండు విధాలుగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు సిట్ గుర్తించింది.

Details

28న హాజరయ్యే అవకాశం

ఒకవైపు నేరుగా ట్యాపింగ్‌కు పాల్పడగా, మరోవైపు కొంతమంది నంబర్ల కాల్ డేటా రికార్డులను కేంద్ర ప్రభుత్వ ఎస్‌ఓపీలను ఉల్లంఘిస్తూ రాబట్టినట్లు తేలింది. కాల్ డేటా రిట్రీవ్ చేసిన విధానం పూర్తి స్థాయిలో అనధికారికంగా జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎంపీలు రఘునందన్‌, ఈటల రాజేందర్‌ స్టేట్‌మెంట్లను సిట్ నమోదు చేసింది. రఘునందన్ మాట్లాడుతూ, దుబ్బాక ఉపఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని, ఆ సమయంలో డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇదే విషయాలను సిట్ అధికారులకు సమర్పించారు. ఇటీవలి కాలంలో బండి సంజయ్‌కు సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపగా, ఆయన మొదట ఈ నెల 28న హాజరవుతానని తెలియజేశారు.