Pune: పుణే ఇనిస్టిట్యూట్‌లో విషాదం.. బాస్కెట్‌బాల్ హూప్ కూలి మెరైన్ ఇంజనీరింగ్ క్యాడెట్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పుణేలోని తోలాని మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్'లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల మెరైన్ ఇంజినీరింగ్ కేడెట్ విశాల్ వర్మ బాస్కెట్‌బాల్ హూప్‌పై పుల్‌అప్స్ చేస్తుండగా, ఆ ఫ్రేమ్ ఒక్కసారిగా కూలి అతని మీద పడింది. తలకు తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చెందిన విషాల్ 2024లో ఈ ఇనిస్టిట్యూట్‌లో చేరి, 2028లో బీటెక్ పూర్తి చేయాల్సి ఉంది. సంస్థ ప్రిన్సిపాల్ సంజిత్ కనుంగో ఈ ఘటనను "చాలా విషాదకరం"గా పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని తెలిపారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్రేమ్ తుప్పు పట్టిందా లేదా ఫిట్టింగ్స్‌లో లోపాలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
వివరాలు
క్రీడా మౌలిక వసతుల నిర్వహణపై ప్రశ్నలు
ఇదే తరహా ఘటనలు ఇటీవల మరోసారి వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఐదు నెలల క్రితం హర్యానాలోని రోహ్‌టక్‌లో 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు హార్దిక్ రాఠీ కూడా ఇలాగే పోల్ కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు బహదుర్గఢ్‌లో కూడా మరో విద్యార్థి మరణించిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలు దేశంలో క్రీడా మౌలిక వసతుల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.