Loading...
Heavy Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక
బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక

Heavy Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఈ వ్యవస్థ సోమవారం మధ్యాహ్నానికి మరింత తీవ్రత సంతరించుకుని ఒడిశా తీరంలోని చాంద్‌బలి-కానింగ్ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సోమవారం నాటికి వాయుగుండం మరింత బలపడనుంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,పోలవరం పరిసర ప్రాంతాలు,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వివరాలు 

ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు

ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

వాయుగుండం ప్రభావం ఒడిశాపై ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

సముద్రం మూడు రోజులపాటు అల్లకల్లోలంగా ఉండే అవకాశముండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని స్పష్టం చేసింది.

ప్రత్యేకంగా చిన్న పడవలతో చేపల వేటకు వెళ్లడం పూర్తిగా నివారించాలని సూచించింది.

అవసరమైతే ఏడు మీటర్లకు పైగా పొడవు ఉన్న పెద్ద పడవలతో మాత్రమే వేటకు వెళ్లడం సురక్షితమని పేర్కొంది.

వివరాలు 

ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు

ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణలో కూడా సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశముందని తెలిపింది.

ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల మంచి వర్షపాతం నమోదైంది.

జగిత్యాల జిల్లా జగ్గాసాగర్‌లో అత్యధికంగా 76.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 51.0 మి.మీ., కందిలో 42.5 మి.మీ., కడ్పాల్‌లో 41.3 మి.మీ., కామారెడ్డి జిల్లా మచ్చాపూర్‌లో 40.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పు లేదు

జులై 27 నుంచి ఆగస్టు 1 వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళ భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగులు, ప్రయాణికులు ముందస్తుగా ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.

వర్షాలు కురుస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు.

తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 34 డిగ్రీల సెల్సియస్, ఆంధ్రప్రదేశ్‌లో 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

ఉత్తర తెలంగాణలో గాలిలో తేమ 70 శాతం వరకు ఉండగా, దక్షిణ తెలంగాణలో సుమారు 55 శాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ADVERTISEMENT