weather-forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 15 నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13 (శుక్రవారం) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 14 (శనివారం) నాటికి మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం నవంబర్ 15 (ఆదివారం) నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
వివరాలు
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
దీని ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు బంగాళాఖాతంలో సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం ఏ దిశగా పయనిస్తుంది? దాని తీవ్రత ఎలా ఉండనుంది? అనే అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అయితే ప్రస్తుతానికి ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండబోదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.