Telangana: తెలంగాణలో బీబీఏ,బీసీఏ ఇక ప్రొఫెషనల్ కోర్సులు.. 2027-28 నుంచి ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) కోర్సుల స్వరూపం మారనుంది. ఇప్పటివరకు యూజీసీ నిబంధనలు, ఆయా విశ్వవిద్యాలయాల సిలబస్ ప్రకారం కొనసాగుతున్న ఈ కోర్సులు ఇకపై వృత్తి విద్యా కోర్సులుగా మారనున్నాయి. దీంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
వివరాలు
2027-28 నుంచి తప్పనిసరి
ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఈ రెండు కోర్సులు మూడేళ్ల కిందటే ఆ సంస్థ పరిధిలోకి రావాల్సి ఉంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఏఐసీటీఈ కొంతకాలం వెసులుబాటు కల్పించింది.
ఇక వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచి బీబీఏ, బీసీఏ నిర్వహించాలంటే ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఆ సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి.
2027-28 విద్యా సంవత్సరానికి అనుమతుల కోసం ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
వివరాలు
పరిశ్రమలకు అనుసంధానంగా సిలబస్
బీబీఏ, బీసీఏలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణమైన నైపుణ్యాలు అందించాలన్న ఉద్దేశంతో ఏఐసీటీఈ 2024-25 నుంచే వీటిని వృత్తి విద్యా కోర్సులుగా గుర్తించింది.
అనంతరం తన పరిధిలోకి తీసుకుని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మోడల్ సిలబస్‌ను రూపొందించింది.
ప్రస్తుతం ఉన్న మూడేళ్ల కోర్సును కొనసాగించడంతోపాటు నాలుగేళ్ల 'ఆనర్స్ విత్ రీసెర్చ్' కోర్సుగా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది.
అయితే నాలుగేళ్ల కోర్సుకే ఏఐసీటీఈ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. మూడేళ్ల కోర్సుకు 120 క్రెడిట్లు, నాలుగేళ్ల కోర్సుకు 160 క్రెడిట్లు కేటాయిస్తారు.
వివరాలు
ఏటా 19 వేల మంది విద్యార్థులు
తెలంగాణలోనూ 2027-28 నుంచి బీబీఏ, బీసీఏ కోర్సులు ఏఐసీటీఈ పరిధిలోకి రానున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏటా సుమారు 13 వేల మంది బీబీఏలో, మరో 6 వేల మంది బీసీఏలో చేరుతున్నారు.
అంటే ఈ రెండు కోర్సుల్లో కలిపి దాదాపు 19 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు.
వివరాలు
ఏటా అనుమతులు పునరుద్ధరించుకోవాలి
ప్రస్తుతం రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలను మూడేళ్లకు ఒకసారి తనిఖీ చేయాలనే నిబంధన ఉంది.
అయితే తనిఖీలు నిర్వహించే అంశం ఆయా విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్స్‌లర్ల నిర్ణయంపై కూడా ఆధారపడి ఉంటుంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలోని కళాశాలల్లో కరోనా ముందు తనిఖీలు జరిగాయి.
ఆ తర్వాత ఏకంగా ఆరు సంవత్సరాలకు ఈ ఏడాది మళ్లీ తనిఖీలు చేపట్టడం గమనార్హం.
బీబీఏ, బీసీఏలు ఏఐసీటీఈ పరిధిలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారనుంది.
కోర్సులను కొనసాగించేందుకు కళాశాలలు ప్రతి సంవత్సరం అనుమతుల పునరుద్ధరణ కోసం ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే ప్రవేశ పరీక్ష నిర్వహించి, అందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది.
వివరాలు
ఫీజులపై టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయం
ఇప్పటివరకు బీబీఏ, బీసీఏ వంటి డిగ్రీ కోర్సులకు ఆయా విశ్వవిద్యాలయాలే ఫీజులను నిర్ణయిస్తున్నాయి.
అయితే ఇవి ప్రొఫెషనల్ కోర్సులుగా మారిన తర్వాత ఫీజుల నిర్ణయంలోనూ మార్పు వస్తుంది.
తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఈ కోర్సులకు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది.
మౌలిక వసతులపై కఠిన నిబంధనలు
ఏఐసీటీఈ నిబంధనలు అమల్లోకి వస్తే కళాశాలల్లోని మౌలిక వసతులపైనా నిర్దిష్ట ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.
ప్రయోగశాలలు, భవనాలు, తరగతి గదులు, అధ్యాపకుల సంఖ్య, వారి విద్యార్హతలు, ఇతర మౌలిక సదుపాయాలు ఏఐసీటీఈ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.
విద్యార్థులకు పరిశ్రమలతో అనుభవాత్మక పరిచయం కల్పించే ఇంటర్న్‌షిప్ అవకాశాలు కూడా ఏఐసీటీఈ పరిధిలో లభించనున్నాయి.
వివరాలు
సీట్ల పెంపులోనూ మార్పులు
ప్రస్తుతం బీబీఏ, బీసీఏలో సీట్ల సంఖ్య పెంచుకోవాలంటే ఆయా కళాశాలలు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి తీసుకోవాల్సి వస్తోంది.
ఈ కోర్సులు ప్రొఫెషనల్ కోర్సులుగా మారిన తర్వాత సీట్ల పెంపు వ్యవహారం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోకి వెళ్లనుంది. కళాశాలలు సీట్ల పెంపు కోసం ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అనుమతించిన అదనపు సీట్ల వివరాలతో కూడిన జాబితాను ఏఐసీటీఈ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు పంపుతుంది.
దీంతో బీబీఏ, బీసీఏ కోర్సుల నిర్వహణ, ప్రవేశాలు, ఫీజులు, మౌలిక వసతులు, సీట్ల పెంపు వంటి అంశాల్లో కొత్త విధానం అమల్లోకి రానుంది.