బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని కార్యాలయాల్లో దాదాపు 60 గంటల పాటు ఐటీ సోదాలు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. సంస్థ ఆర్థిక లావాదేవీలపై పలువురు ఉద్యోగులను ప్రశ్నించారు. దిల్లీ, ముంబయిలోని తమ కార్యాలయాల నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు వెళ్లిపోయారని, అధికారులకు తాము సహకరిస్తామని, ఈ అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని బీబీసీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బీబీసీ విశ్వసనీయమైన స్వతంత్ర మీడియా సంస్థ. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా వార్తలందిస్తామని, తమ జర్నలిస్టులకు, సహోద్యోగులకు తాము అండగా నిలబడతామన్నారు.
ఇది పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకం
అయితే సోదాల గురించి ఐటీ శాఖ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. సోదాల్లో భాగంగా పలువురు ఉద్యోగులను మూడు రోజులుగా అధికారులు ఇంటికి పంపలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మంగళవారం నుంచి 10 మంది ఉద్యోగులు ఢిల్లీ ఆఫీసులోనే ఉన్నట్లు సమాచారం. బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలు కావడం విశేషం బీబీసీ కార్యాలయాల్లో ఐటీ 'సర్వే'ను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సమర్థించింది. ఏ సంస్థ కూడా చట్టానికి అతీతం కాదని ఆ పార్టీ పేర్కొంది. ఇది పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని పాత్రికేయ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఐటీ సోదాలను ఖండించారు.