
బీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు- మూడు రోజులుగా ఇంటికెళ్లని ఉద్యోగులు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఆదాయపు పన్ను శాఖ సోదాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. దాదాపు 45 గంటలకు పైగా ఏకధాటిగా అధికారులు సర్వే చేస్తున్నారు.
ఈ క్రమంలో దిల్లీ ఆఫీసులోని 10మంది సీనియర్ ఉద్యోగులు మూడు రోజులుగా తమ ఇళ్లకు వెళ్లకుండా ఐటీ అధికారులతోనే ఉన్నారు. అధికారులు అడిగిన వివరాలు చెబుతూ, వారికి సహకరిస్తున్నారు.
సర్వే ఎప్పుడు ముగుస్తుందో ఖచ్చితంగా చెప్పలేమని ఐటీ ఆధికారులు చెబుతున్నారు.
బీబీసీ ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్మాణం, ఇతర వివరాలను ఐటీ అధికారులు బీబీసీ ఉద్యోగులను ద్వారా తెలుసుకొని రికార్డు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి డేటాను కాపీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బీబీసీ
ఐటీ అధికారులకు సహకరిస్తున్నాం: బీబీసీ ఉద్యోగులు
బీబీసీ సిబ్బంది ఇంటి నుంచే పని చేస్తున్నారని ఒక ఉద్యోగి చెప్పారు. ఈ సోదాల గురించి ఆదాయపు పన్ను శాఖ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ అధికారులకు బీబీసీ సహకరిస్తున్నట్లు ఉద్యోగులు చెపారు.
ఇదిలా ఉంటే, బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులను ప్రతిపక్షాలు ఇప్పటికే ఖండించాయి. దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీగా కాంగ్రెస్ అభివర్ణించింది.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో బీబీసీ ఆఫీస్‌లపై ఐటీ దాడులు చేయడం గమనార్హం.