
బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి, దిల్లీలో బీబీసీకి చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి.
పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. 2012 నాటి ఖాతా వివరాలను కూడా తనిఖీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బీబీసీ అనుబంధ కంపెనీల అంతర్జాతీయ పన్నులు, నదగు బదిలీలో జరిగిన అవకతవకలను తేల్చేందుకు ఈ సర్వేలు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు.
ఇదిలా ఉంటే, బీబీసీ సిబ్బంది నుంచి తీసుకున్న ఫోన్లను తిరిగి ఇచ్చేస్తామని, ఇవి ఐటీ దాడులు కాదని, సర్వే మాత్రమే చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
బీబీసీ వద్ద చాలా డేటా ఉందని, అందుకే ఒక రోజులో ఈ సర్వే తేలదని ఐటీ అధికారులు చెబుతున్నారు.
బీబీసీ
ఐటీ సోదాలపై స్పందించిన అమెరికా
బీబీసీ ఆఫీసులపై దాడుల అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఇప్పటికే దీనిపై అమెరికా కూడా స్పందించింది. ఐటీ దాడులు జరుగుతున్నాయని తమకు తెలుసునని, దానిపై ఇప్పుడే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని అమెరికా పేర్కొంది.
అయితే ఈ వ్యవహారంపై యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. గ్లోబల్ మీడియా హక్కుల సంఘాలు, భారతదేశ ప్రతిపక్ష నాయకులు ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో బీబీసీ ఆఫీస్‌లపై ఐటీ దాడులు చేయడం గమనార్హం.