BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు
ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అంతర్జాతీయ పన్నులు, నగదు బదిలీల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో బీబీసీ కార్యాలయాల్లో సోదాలు జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో బీబీసీ ఆఫీస్‌లపై ఐటీ దాడులు చేయడం గమనార్హం.
ఉద్యోగులను ఇంటికి పంపించిన ఐటీ అధికారులు
దిల్లీలో ఐటీ అధికారులు బీబీసీ ఆఫీస్‌లోకి వెళ్లిన వెంటనే ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని ఇంటి నుంచి పని చేసుకోవాలని సూచించారు. ఉర్దూ సేవలను చూస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఆర్థికశాఖ అధికారులతో పాటు కార్యాలయం ఆవరణలో ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. ఇదిలా ఉంటే, బీబీసీకి ముంబయిలో రెండు కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో ఉండగా, ఇంకోటి ఖార్ లో ఉంది. ఐటీ అధికారులు బీకేసీ కార్యాలయ ఆవరణలో ఉండగా, బీబీసీ ఖార్ కార్యాలయంలోని ఉద్యోగులను ఇళ్లకు వెళ్లాల్సిందిగా కోరారు. సంస్థ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలతో పాటు భారతీయ విభాగానికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నట్లు ఐటీ అధికారులు చెప్పారు.