Cyberabad Traffic Police: న్యూ ఇయర్ వేళ జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్యాబ్ ఆపరేటర్లు, సాధారణ ప్రజలు, బార్-పబ్ యజమానులకు కీలక సూచనలు జారీ చేశారు. క్యాబ్ డ్రైవర్లు, ఆటో రిక్షా డ్రైవర్లు తప్పనిసరిగా సరైన యూనిఫాం ధరించి, అవసరమైన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని పోలీసులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్ విధిస్తామని, అధిక ఛార్జీలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లకు వచ్చే కస్టమర్లు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా యజమానులు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బార్, పబ్, క్లబ్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరానికి ప్రోత్సాహం ఇచ్చినట్టుగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
Details
రాత్రి 8 గంటల నుంచి విస్తృత తనిఖీలు
రాంగ్ రూట్ డ్రైవింగ్, అనధికార పార్కింగ్, అధిక వేగం, సిగ్నల్ జంపింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వంటి ఉల్లంఘనలను గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ కెమెరాల ద్వారా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని ప్రధాన రహదారులపై రాత్రి 8 గంటల నుంచి విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. పత్రాలు చూపించని వాహనాలను తాత్కాలిక భద్రతా కస్టడీకి తరలిస్తామని స్పష్టం చేశారు.
Details
మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు
అలాగే ఎవరైనా అసభ్య ప్రవర్తనకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక బుక్ చేసుకున్న రైడ్‌లను క్యాబ్, టాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు రద్దు చేయకూడదని పోలీసులు సూచించారు. ఎవరికైనా ఈ తరహా ఇబ్బందులు ఎదురైతే వాహన వివరాలతో 9490617346 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాల్లో అధిక శబ్దంతో మ్యూజిక్ ప్లే చేయరాదని కూడా ట్రాఫిక్ పోలీసులు స్పష్టంగా హెచ్చరించారు.