Page Loader
సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు.. చిత్రీకరించింది ఎవరో తెలుసా?
సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు

సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు.. చిత్రీకరించింది ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Stalin
Jan 04, 2023
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అమ్మవారు మూల విరాట్టు వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు దుర్గ గుడి ఈవో భ్రమరాంబ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విచారణకు ఆదేశించారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలించారు. శాంతకుమారి అనే భక్తురాలు గర్భాలయంలో ఉన్న అమ్మవారిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. డిసెంబర్ 22వ తేదీ ఉదయం 9.52 గంటలకు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించినట్లు శాంతకుమారి కుమారి కూడా ఒప్పుకున్నారు.

విజయవాడ

భద్రతా సిబ్బందిపై ఆగ్రహం

దుర్గ గుడి భద్రతా సిబ్బందికి ఈఓ నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ వీడియో తీసిన శాంతకుమారిపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలోకి ఫోన్లను అనుమతించడం, వీడియోలు తీస్తున్న భద్రతా సిబ్బందిని గుర్తించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ అనుమతి లేకుండా కూడా అమ్మవారి సన్నిధిలో వీడియో రికార్డు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్టీఎఫ్ భద్రత, ప్రైవేట్ సెక్యూరిటీ, సీసీ కెమెరాల నిఘా ఉన్నా వీడియో రికార్డింగ్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. అదుపు చేయాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.