దిల్లీలో బెంగాల్ వ్యాపారి కిడ్నాప్.. ముగ్గురు అరెస్ట్
33ఏళ్ల వ్యాపారవేత్తను అపహరించి, అతని నుంచి సుమారు రూ. 3 లక్షలు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బబ్లూ యాదవ్ అనే వ్యాపారి సెప్టెంబరు 20న సిలిగురిలోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం నుంచి దిల్లీకి ఆపిల్స్ కొనడానికి రాగా, ఈ ఘటన జరిగింది. ఆజాద్‌పూర్ మండిలోని హోల్‌సేల్ మార్కెట్‌లో యాపిల్స్ కొనుగోలు చేయడానికి బబ్లూ యాదవ్ వచ్చాడు. ఈ క్రమంలో దిల్లీ విమానాశ్రయం నుంచి అతని స్నేహితుడు అజయ్ పంపిన టాక్సీలో ద్వారకలోని సెక్టార్-21 వద్ద ఓ ఫ్లాట్‌కు వచ్చాడు. అజయ్ సహచరుడు ఒకరు అప్పటికే ఫ్లాట్‌లో ఉన్నాడు. అతని మరో నలుగురు సహచరులు ఫ్లాట్‌కి వచ్చి, యాదవ్‌ను కారులో బలవంతంగా తీసుకెళ్లారు.
మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు
కిడ్నాప్ చేసిన తర్వాత యాదవ్‌ను నిందితులు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో యాదవ్ అతని బంధువులకు ఫోన్ చేసి వేర్వేరు ఐదు యూపీఐ ఐడీల ద్వారా మొత్తం రూ.2.7 లక్షలను కిడ్నాపర్లకు పంపేలా చేశాడు. డబ్బు అందిన తర్వాత కిడ్నాపర్లు యాదవ్‌ను బహదూర్‌గఢ్ సిటీ మెట్రో స్టేషన్ సమీపంలో వదిలేశారు. అనంతరం యాదవ్ దిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించాడు. సెప్టెంబర్ 22న అజయ్ సహా ఐదుగురు నిందితులపై ఫిర్యాదు చేసినట్లు యాదవ్ ఫిర్యాదు చేసినట్లు డీసీపీ జి.రామ్ గోపాల్ నాయక్ తెలిపారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. అజయ్‌తో పాటు ఐదో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డీసీపీ తెలిపారు.