Sheikh Shahjahan: షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్‌లో సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్టు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్ ప్రభుత్వం నిరాకరించింది. సందేశ్‌ఖాలీలో ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐకి బదిలీ చేస్తూ మార్చి 5న కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో షాజహాన్ షేక్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు సీబీఐ బృందం బెంగాల్ పోలీసు ప్రధాన కార్యాలయం అయిన భబానీ భవన్‌కు చేరుకుంది. షాజహాన్ షేక్‌ను సిబీఐకి అప్పగించేందుకు బెంగాల్ ప్రభుత్వం నిరాకరించడంతో.. అధికారులు కస్టడీలోకి తీసుకోకుండానే తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
సుప్రీంకోర్టుకు వెళ్లిన బెంగాల్ ప్రభుత్వం
కోల్‌కతా హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన నేపథ్యంలో షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిరాకరించింది. ఈ కేసును సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు ఉంచింది. ఈ కేసుపై తక్షణమే విచారణ జరపాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే, వెంటనే విచారణకు బెంచ్ నిరాకరించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ముందు కేసు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.