West Bengal: బెంగాల్ సర్కార్ సంచలన నిర్ణయం.. 252 మదర్సాలు మూసివేత.. 100 సంస్థలకు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో గుర్తింపు లేని మదర్సాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వే అనంతరం నిబంధనలు పాటించని 252 ప్రభుత్వేతర, ప్రైవేట్ మదర్సాలను మూసివేయాలని అధికారులు సంచలన ఆదేశాలు జారీ చేశారు. మరో 100మదర్సాలకు మౌలిక సదుపాయాలు, అవసరమైన అనుమతులు లేవన్న కారణంతో షోకాజ్ నోటీసులు పంపించారు. జూన్ ప్రారంభం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్ సర్వే నిర్వహించింది. ఈ తనిఖీల్లో 252మదర్సాల వద్ద సరైన అనుమతి పత్రాలు లేవని, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. అధికారిక, అనధికారిక మదర్సాల సంఖ్యను తేల్చేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు మైనారిటీ సంక్షేమం, మదర్సా విద్య శాఖ మంత్రి క్షుదీరామ్ తుడు తెలిపారు.
వివరాలు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే సర్వే
ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశాల మేరకే ఈ సర్వే ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
షోకాజ్ నోటీసులు అందుకున్న 100మదర్సాలు ఇచ్చే సమాధానాలను పరిశీలించిన తర్వాతే వాటిపై తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి చట్టబద్ధంగా నడిచే మదర్సాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మదర్సాల కార్యకలాపాలన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉగ్రదాడిలోనూ ఏదో ఒక మదర్సా ఉపాధ్యాయుడి ప్రమేయం బయటపడిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఉగ్రవాదులకు ఈ మదర్సాలు ఆశ్రయం కల్పిస్తున్నాయని దిలీప్ ఘోష్ ఆరోపించారు.
వివరాలు
దేశవ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా ఉన్నాయంటూ విమర్శ
గతంలో చాలామంది నాయకులు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోయారని, అయితే తమ ప్రభుత్వం ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
చట్ట ప్రకారం నడిచే మదర్సాల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు.
అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మదర్సాలను ఏర్పాటు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే అధికార పక్షం తీరుపై ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుణాల్ ఘోష్ మండిపడ్డారు. అన్ని మదర్సాలను ఒకే కోణంలో చూడటం సరికాదని ఆయన అన్నారు. ప్రతి మదర్సాను అనుమానాస్పద సంస్థగా చిత్రీకరించకూడదని స్పష్టం చేశారు.