బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులను కలిపే బెంగళూరు-హైదరాబాద్(ఎన్‌హెచ్ 44) జాతీయ రహరదారి విస్తరణ పనులు ఏడాది పాటు ఆలస్యం కానున్నాయి. రెండు ఐటీ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు మంజూరైన హైదరాబాద్- బెంగళూరు డిజిటల్ హైవే పనులు 2024-25లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా సుమారు 10,000 కి.మీ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) మౌలిక సదుపాయాల కల్పించాలని, రోడ్లను అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గతంలో నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ప్రణాళికలు రచించింది. ఈ 10,000 కిలోమీటర్ల జాబితాలో బెంగళూరు-హైదరాబాద్ హైవేకు కూడా స్థానం లభించింది.
రూ.4,750 కోట్లు కేటాయింపు
బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవేను నాలుగు లైన్ల నుంచి ఆరు లేన్‌లుగా తీర్చి దిద్దనున్నారు. ఈ హైవే విస్తరణ కోసం కేంద్రం రూ. 4,750 కోట్లను కేటాయించింది. బెంగళూరు-హైదరాబాద్ మధ్య దూరం 576 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో తెలంగాణలో 190 కిలోమీటర్లు ఉంటాయి. మిగతా రోడ్డు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఉంది. గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పట్టేది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ రోడ్డును ఫోర్ లేన్‌గా మార్చారు. తద్వారా ప్రయాణ సమయం ఎనిమిది గంటలకు తగ్గించారు. ఇప్పుడు ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించేందుకు రహదారిని 6లేన్లుగా విస్తరించనున్నారు.