Bengaluru: టాక్సీ ఏదైనా డ్రైవర్లు చుక్కలు చూపటం పక్కా
ఊబర్ టాక్సీ , బైక్ సేవలపై వినియోగదారులు కొంత కాలంగా అసంత్తృప్తిగా ఉన్నారు. ఈ టాక్సీలను నడిపే డ్రైవర్లు వినియోగదారుల పట్ల దురుసుగా వ్యవహరించటం రివాజుగా మారింది. బుక్ చేయగానే వస్తున్నట్లు కనిపించినా ఉన్నపళంగా కాన్సిల్ చేయటం వారికి పరిపాటిగా మారింది. ఇలాంటి ఫిర్యాదులు ఎన్ని వచ్చినా ఊబర్ యాజమాన్యం పట్టనట్లే వ్యవహరిస్తోంది. టాక్సీ డ్రైవర్లు మీటర్ ప్రారంభ సమయంలో చూపిన చార్జీ ఒక విధంగా ఉంటుంది. తీరా గమ్య స్ధానానికి చేరుకున్నాక చూపే చార్జీకి వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఇదేమని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా జవాబు చెపుతున్నారు డ్రైవర్లు. గౌరవ ప్రదంగా జీవించే వారు నడి బజారులో రోడ్లపై డ్రైవర్లతో గొడవ పడలేక వారిని విడిచి పెడుతున్నారు.
బెంగళూరులో డాక్టర్ కు చేదు అనుభవం
ఇలాంటి చేదు అనుభవమే బెంగళూరు నగరంలో డాక్టర్ అధరవ్ దావర్ కు ఎదురైంది. డాక్టర్ అధరవ్ దావర్ తాను ప్రయాణిస్తున్నఊబర్ టాక్సీ డ్రైవర్ ను ఎసి ఆన్ చేయమన్నారు. దాంతో డ్రైవర్ కు కోపం వచ్చింది.ఎసి ఆన్ చేయడం కుదరదన్నాడు. దీనికి కారణం ఎసి పని చేయడం లేదన్నాడు. ముందు హిందీలో మాట్లాడిన డ్రైవర్ ఆ తర్వాత కన్నడలో తనను దుర్భాషాలాడాడని వాపోయారు. ఆ తర్వాత తన స్నేహితుడి కారులో కూర్చోమని కోరగా తాను తిరస్కరించానని డాక్టర్ చెప్పారు. ఎసి టాక్సీఛార్జీ వసూలు చేసినప్పటికీ తనకు సరైన సేవలు అందించలేదన్నారు. డాక్టర్ ఇందుకు సంబంధించిన 16 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై పలువురి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది.
ఇకనైనా కట్టడి చేయాలి
ఇటువంటి తిప్పలు బెంగళూరు నగరనికి పరిమితం కాలేదంటూ పలువురు సంఘీభావం ప్రకటించారు. ఏది ఏమైనా ఊబర్ తో సహా ఇలాంటి వారి ఆటకట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.