Khammam: ఖమ్మంలో విషాదం.. మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి 10 మంది రెస్క్యూ సిబ్బంది గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన రెస్క్యూ సిబ్బందే వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువులో రెండు బోట్లు నీటి ఉద్ధృతికి బోల్తా పడటంతో 10మంది ఎస్డీఆర్ఎఫ్,అగ్నిమాపక శాఖ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ వర్షాల కారణంగా బేతుపల్లి పెద్ద చెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో చేపలు బయటకు వెళ్లకుండా వలలు ఏర్పాటు చేసేందుకు చెరువులోకి వెళ్లిన కొందరు మత్స్యకారులు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు సహాయక బృందాలను రంగంలోకి దించారు.
వివరాలు
ఉద్ధృతంగా వస్తున్న వరద ప్రవాహానికి రెండు బోట్లు అదుపుతప్పి బోల్తా
మొదట ముగ్గురు అగ్నిమాపక శాఖ సిబ్బంది ఒక బోటులో మత్స్యకారుల వద్దకు వెళ్లారు.
అయితే మార్గమధ్యలో బోటు మొరాయించడంతో వారే ప్రమాదంలో చిక్కుకున్నారు.
దీంతో కొత్తగూడెం నుంచి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, అదనంగా అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.
రెండు బోట్లలో వెళ్లిన రెస్క్యూ బృందాలు తొలుత ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు ఫైర్ సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చాయి.
అనంతరం మిగిలిన మత్స్యకారులను రక్షించేందుకు సిబ్బంది మరోసారి రెండు బోట్లలో చెరువులోకి వెళ్లారు.
ఈ క్రమంలో చెరువు అలుగు నుంచి ఉద్ధృతంగా వస్తున్న వరద ప్రవాహానికి రెండు బోట్లు అదుపుతప్పి బోల్తా పడ్డాయి.
దీంతో వాటిలో ప్రయాణిస్తున్న 10మంది ఎస్డీఆర్ఎఫ్,అగ్నిమాపక శాఖ సిబ్బంది నీటిలో గల్లంతయ్యారు.
వివరాలు
గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు
మత్స్యకారుల ప్రాణాలు కాపాడేందుకు వెళ్లిన సిబ్బందే ప్రమాదంలో చిక్కుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎమ్మెల్యే మట్టా రాగమయి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గల్లంతైన 10 మంది సిబ్బంది ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలను పర్యవేక్షించారు. భద్రాచలం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రప్పించారు.
మరో బోటు సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా లైఫ్ జాకెట్లు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అయితే వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
వివరాలు
సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
బేతుపల్లి చెరువులో బోట్లు బోల్తా పడి 10 మంది రెస్క్యూ సిబ్బంది గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
గల్లంతైన సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సూచించారు.
మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
మత్స్యకారుల ప్రాణాలు కాపాడేందుకు వెళ్లిన సిబ్బందే ప్రమాదంలో చిక్కుకోవడంతో వారి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
గల్లంతైన 10 మంది సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.