Bhatti Vikramarka: స్వయం సహాయక సంఘాలకు గుడ్‌న్యూస్.. ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హైడ్రా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వం అయినా వీటిని అనుసరిస్తుందని వివరించారు. హైడ్రా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అక్రమార్కులు పార్కులు, సరస్సులు ఆక్రమించకుండా ఉండేందుకు కృషి చేస్తుందని చెప్పారు. బ్యాంకింగ్ రంగం ద్వారా కొన్ని ప్రభుత్వ శాఖలకు చేయూత అందించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
3000 కోట్ల వడ్డీ లేని రుణాలు
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రకటించారు. కార్పొరేట్, కమర్షియల్ బ్యాంకులు 9-13 శాతం వడ్డీ వసూలు చేస్తున్న నేపథ్యంలో, బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలని, రుణాల కోసం ఉన్న నిబంధనలను సరళతరం చేయాలని సూచించారు. ప్రైవేటు విభాగాల్లో రుణాల రికవరీ శాతం తక్కువగా ఉండగా, స్వయం సహాయక సంఘాల రికవరీ శాతం 98% పైగా ఉందని వివరించారు. హైదరాబాద్‌లో 3,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మహిళలకు అందించాలని, వాటిని 5,000 కోట్లకు పెంచాలని అధికారులను ఆదేశించారు.