Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్.. టేకాఫ్‌కు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాల ప్రారంభానికి మరో కీలక ముందడుగు పడింది. విమానాల రాకపోకలకు అవసరమైన ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను శుక్రవారం ఢిల్లీలో జీఎంఆర్ సంస్థకు కేంద్ర పౌరవిమానయాన శాఖ అందజేసింది. ఈ సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం విమానాశ్రయం టేకాఫ్‌కు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ అందజేయడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక విమానాశ్రయానికి ఇచ్చిన అనుమతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్రను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే కొత్త యుగానికి నాంది పలికే ఘట్టమని అన్నారు.
వివరాలు
ప్రపంచ స్థాయి ఏరోట్రోపోలిస్‌గా భోగాపురం
ప్రపంచ స్థాయి ఏరోట్రోపోలిస్‌గా భోగాపురం రూపుదిద్దుకుంటోందని ఆయన తెలిపారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఎయిర్ కార్గో కేంద్రాలు, విమాన నిర్వహణ కేంద్రాలు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, బిజినెస్ పార్కులు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. వీటి ద్వారా పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, పర్యాటకం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ప్రహరీ వెంట సీసీ డ్రెయిన్ నిర్మాణానికి రూ.85 లక్షలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా మరో నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. విమానాశ్రయం ప్రహరీ గోడ వెంట సీసీ డ్రెయిన్ నిర్మాణం చేపట్టేందుకు రూ.85 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (APADCL) మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.