Visakhapatnam Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖపట్నం పేరు.. నవంబర్ 21 నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం విమాన ప్రయాణికుల్లో కొంతకాలంగా కొనసాగుతున్న గందరగోళానికి తెరపడనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నగరం పేరును మార్చేందుకు అంతర్జాతీయ వాయు రవాణా సంఘం(IATA)నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ విమానాశ్రయం వివరాల్లో భోగాపురం స్థానంలో విశాఖపట్నం పేరు కనిపించనుంది. ఈ మార్పు నవంబర్ 21 నుంచి అమల్లోకి రానుంది.భోగాపురంలో నిర్మించిన ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం గత ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది. అంతకుముందు విశాఖపట్నం నగరంలోని ఐఎన్‌ఎస్ డేగా వద్ద ఉన్న సివిల్ ఎన్‌క్లేవ్ నుంచి విమాన సర్వీసులు కొనసాగేవి. ఆ విమానాశ్రయానికి 'VTZ'అనే IATA కోడ్ ఉండేది.భోగాపురంలో కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో పాత విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేశారు.
వివరాలు
ప్రయాణికుల గందరగోళాన్ని నివారించడమే లక్ష్యం
అదే సమయంలో పాత విమానాశ్రయానికి కేటాయించిన 'VTZ' కోడ్‌ను కొత్త విమానాశ్రయానికి బదిలీ చేశారు.
అయితే, కొత్త విమానాశ్రయం భౌగోళికంగా భోగాపురంలో ఉన్నప్పటికీ, ప్రధానంగా విశాఖపట్నం నగరానికి సేవలందిస్తోంది.
ఈ నేపథ్యంలో విమాన టికెట్ల బుకింగ్ సమయంలో ప్రయాణికులకు కొంత అయోమయం ఎదురవుతోంది.
బుకింగ్ వెబ్‌సైట్లలో 'VTZ' కోడ్ కనిపించడంతో చాలామంది ఇది విశాఖపట్నం నగరంలోని విమానాశ్రయమేనని భావిస్తున్నారు.
కానీ వాస్తవానికి భోగాపురం విమానాశ్రయం విశాఖపట్నం నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వివరాలు
VTZ కోడ్ యథాతథం, మారేది నగరం పేరే
ఈ సమస్యను గుర్తించిన IATA కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయం నగరం పేరును భోగాపురం నుంచి విశాఖపట్నంగా మారుస్తున్నట్లు ప్రకటించింది.
నవంబర్ 21 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు'VTZ'కోడ్‌తో పాటు నగరం పేరు భోగాపురంగా నమోదై ఉండగా,ఇకపై అదే కోడ్‌తో విశాఖపట్నం పేరుతో విమానాశ్రయ వివరాలు కనిపించనున్నాయి.
అంటే విమానాశ్రయ కోడ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం నగరం పేరు మాత్రమే మారుతుంది.
ఈ నిర్ణయంతో విమాన టికెట్ల బుకింగ్ సమయంలో ప్రయాణికులకు ఎదురవుతున్న సందేహాలు తొలగిపోనున్నాయి.
విశాఖపట్నం పేరుతో విమానాశ్రయం వివరాలు కనిపించడం వల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాన్నిసులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
టికెట్ల బుకింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు, గందరగోళం ఉండవని ప్యాసింజర్స్ అసోసియేషన్ పేర్కొంది.