Telangana: జూనియర్ అసిస్టెంట్ల చేతికి 'భూభారతి'.. ఆపరేటర్లకు గుడ్‌బై!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం సాగు భూముల నిర్వహణకు సంబంధించిన 'భూభారతి' పోర్టల్ నిర్వహణలో కీలక మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఈ పోర్టల్‌ను నిర్వహిస్తున్న ఆపరేటర్ల స్థానంలో ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి మండలానికి ఒక జూనియర్ అసిస్టెంట్‌ను ఎంపిక చేసి, వారికి జిల్లా కేంద్రాల్లో అవసరమైన సమగ్ర శిక్షణ ఇవ్వాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్‌కుమార్ హైదరాబాద్‌ను మినహాయించి రాష్ట్రంలోని 32 జిల్లాల కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను ఈ నెల 7వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు.
వివరాలు
2020 నవంబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభం
రాష్ట్రంలో 2020 నవంబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభమైన విషయం తెలిసిందే.
అప్పట్లో తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించగా, వారికి సహాయకులుగా ఆపరేటర్లను నియమించారు.
ధరణి పోర్టల్‌ను ఒక ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేయగా, ఆపరేటర్లను కూడా అదే సంస్థ నియమించి వారికి వేతనాలు చెల్లించేది.
ఈ విధానం గత ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ధరణి పోర్టల్‌కు బదులుగా 'భూభారతి' వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చి, దాని నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ)కి అప్పగించింది.
వివరాలు
భూ అక్రమాల్లో ఆపరేటర్ల పాత్ర
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన పలు భూ అక్రమాల్లో అనేక జిల్లాల్లో ఆపరేటర్ల పాత్ర ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం.
దీంతో భూభారతి వంటి కీలక వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులే పనిచేయాలనే ఉద్దేశంతో ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అన్ని ఏర్పాట్లు పూర్తయితే ఈ నెల 8వ తేదీ నుంచే జూనియర్ అసిస్టెంట్లకు భూభారతి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను అధికారికంగా అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.