Mahadev app case: బీజేపీ నా పరువు తీసేందుకు ప్రయత్నిస్తోంది: భూపేష్ బఘేల్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన శుభమ్ సోనీ చేసిన వాదనలను అనుసరించి,ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తన పరువు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అయన మండిపడ్డారు. దుబాయ్‌లో తన గ్యాంబ్లింగ్ వ్యాపారాన్ని నెలకొల్పడానికి బఘేల్ తనను ప్రోత్సహించాడని సోనీ ఒక వీడియో సందేశంలో ఆరోపించారు. భిలాయ్‌లో తన సహచరుల అరెస్టుకు సంబంధించి తాను బఘేల్‌ను సంప్రదించినట్లు తెలిపారు. ఈ వాదనలపై బఘెల్ స్పందిస్తూ, "ఈ వీడియో ఎందుకు,ఎలా వచ్చిందనేది మిస్టరీ కాదు. బిజెపికి ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సమయంలో ఇటువంటి ప్రకటన జారీ చేయబడిందని అర్థం చేసుకోవడం కూడా కష్టం కాదని బఘెల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈడీ సహాయంతో బీజేపీ ఎన్నికల్లో పోటీ
ఈడీని ఆయుధంగా చేసుకొని బీజేపీ ఈ వ్యవహారం నడిపిస్తోందని అందరికి తెలుసునని అన్నారు. వాస్తవానికి, బీజేపీ ఇప్పుడు ఈడీ సహాయంతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని,తన పరువు తీసేందుకు ఈడీని ఉపయోగిస్తోందని ఆయన X వేదికగా పేర్కొన్నారు. వీడియో సందేశంలో శుభమ్ సోనీ చేసిన అన్ని వాదనలను బఘెల్ తోసిపుచ్చారు. తానూ అతనిని ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఈ వ్యక్తి తనకు తెలియదని అతనిని తానూ ఎప్పుడూ కలవలేదని తెలిపారు. అతను ఏదైనా సమావేశం లేదా ఫంక్షన్‌లో కలిశాడా అన్నది తానూ స్పష్టంగా చెప్పలేనని అయన X లో రాసుకొచ్చారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కూడా బాఘెల్ ప్రశ్నించారు.
ఇప్పటివరకు భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లించా: శుభమ్ సోనీ
శుభమ్ సోనీ తాను'మహదేవ్ యాప్' యజమాని అని చెప్పుకుంటున్నాడు. ఆశ్చర్యకర విషయమేంటంటే,ఈ కేసును నెలల తరబడి దర్యాప్తు చేస్తున్న ఈడీ ఏజెన్సీకి కూడా ఈ విషయం తెలియదు. రెండు రోజుల క్రితం వరకు కూడా ఈడీ అతన్ని మేనేజర్‌గా పిలుస్తోందని అని బఘేల్ రాసుకొచ్చారు. మహదేవ్ బెట్టింగ్ యాప్‌కు తానే యజమానినని, 2021లో దాన్ని స్థాపించానని, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు ఇప్పటివరకు రూ.508 కోట్లు చెల్లించినట్లు తన వద్ద 'రుజువు' ఉందని సోనీ ఆ వీడియో సందేశంలో తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకుంటారు. ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షమైన ఈడీ కి తగిన సమాధానం ఇస్తారని బఘేల్ ముగించారు.
భూపేష్ కు ఇచ్చిన డబ్బుకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి: శుభమ్ సోనీ
శుభమ్ సోనీ వీడియోను బీజేపీ సెంట్రల్ మీడియా కన్వీనర్ సిద్ధార్థనాథ్ సింగ్ విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. డబ్బులు ఇచ్చినా తన పని జరగడం లేదని, ఈ వ్యవస్థతో ఏమి చేయాలో తనకు అర్థం కావడంలేదని, ఈడీ నాపై చర్యలు ప్రారంభించిందని సోనీ వీడియోలో చెప్పారు. తనకు సహాయం చేయమని భారత ప్రభుత్వానికి అభ్యర్ధించారు. తానూ రాజకీయ వ్యవస్థలో చిక్కుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చిక్కుల నుండి బయటపడాలనుకుంటున్నాని, ఇచ్చిన డబ్బుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. భారతదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నాని వీడియోలో చెప్పాడు. ED ప్రకారం, మహాదేవ్ యాప్‌ను దుబాయ్‌కి చెందిన సౌరభ్ చంద్రకర్, అతని సహచరుడు రవి ఉప్పల్ నడుపుతున్నారు.ఈ ఇద్దరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు.