 
                                                                                Ration Distribution: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. నేడే పంపిణీ!
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నేడే రేషన్ పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమవుతుండగా, ఈసారి తుపాను పరిస్థితుల దృష్ట్యా ముందుగానే పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావం చూపే 12 జిల్లాల్లో రేషన్ పంపిణీ జరగనుంది. వీటిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలున్నాయి. ఈ జిల్లాల్లో మొత్తం 14,145 రేషన్ షాపుల ద్వారా సరుకులు అందించనున్నారు.
Details
ఉదయం 9 గంటలకే పంపిణీ
దాదాపు 7 లక్షల మంది లబ్ధిదారులు ఈ నిర్ణయం ద్వారా లాభపడతారని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, నిత్యావసర సరుకులను ఇప్పటికే రేషన్ షాపులకు చేర్చాం. ఉదయం 9 గంటల నుంచే పంపిణీ ప్రారంభమవుతుంది. బియ్యం, పంచదారతో పాటు సబ్సిడీ సరుకులు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇక తుఫాన్ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రతి కుటుంబానికి రూ.3వేలు నగదు సాయం అందించాలన్నారు.
Details
విద్యా సంస్థలకు సెలవులు
అదనంగా 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు. తుపాన్ ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని కూడా సీఎం ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు తుఫాన్ రక్షణ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. వాలంటీర్లు, సేవా సంస్థలు ముందుకు వస్తే వారిని సహాయక చర్యల్లో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిబద్ధతతో పనిచేయాలని, మొంథా తుపాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని చంద్రబాబు తెలిపారు.