 
                                                                                Fee Reimbursement: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు నుంచి కాలేజీలు బంద్.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, పూర్తి బకాయిలు విడుదల కానందున తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రభుత్వ అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు హెచ్చరించారు. ఇంజినీరింగ్, ఫార్మసీతో పాటు ఇతర వృత్తి విద్యా కాలేజీలు కూడా ఈ బంద్‌లో పాల్గొననున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.1200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు.
Details
నవంబర్ 1లోపు రూ. 900 కోట్లు చెల్లించాలి
కానీ ఇప్పటివరకు రూ.300 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. 'మంత్రులు సహకరించడం లేదు. నవంబర్ 1వ తేదీ లోపు కనీసం రూ.900 కోట్లు విడుదల చేయాలి. లేకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ చేపడతామని రమేశ్ బాబు స్పష్టం చేశారు. అలాగే బకాయిలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 'మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం. ఒక్క పోలీసుని కూడా కాలేజీలోకి అనుమతించమని ఆయన హెచ్చరించారు. ఇటీవల కూడా బంద్ పిలుపునిచ్చినా, ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కాలేజీలు వెనక్కి తగ్గాయి. అప్పటి నుంచి బకాయిల చెల్లింపులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో యాజమాన్యాలు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈసారి బంద్ విషయంలో పూర్తి కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించారు
Details
మొత్తం బకాయిలు సుమారు రూ.10వేల కోట్లు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1500కుపైగా వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. వీటిలో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఇతర ఫీజులు కూడా కాలేజీలకు ప్రభుత్వంనుంచి రావాల్సి ఉందని యాజమాన్యాలు చెబుతున్నాయి. మొత్తం బకాయిల పరిమాణం సుమారు రూ.10 వేల కోట్లకు చేరిందని సమాచారం. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల మూత తప్పదని హెచ్చరించారు.